గద్వాల, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో సంక్షేమ సర్కారు నడుస్తుందని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై బీజేపీ నాయకులు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి,రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్పతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నపూర్ణ తెలంగాణగా మారిందని చెప్పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయనని చెప్పడంతో రైతుల కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేశారని గుర్తుచేశారు. దేశానికి అవసరమైన ఆహార ఉత్పత్తులు తెలంగాణ పండిస్తుందని తెలిపారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి తెలంగాణ అని చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులకు కళ్లు,కడుపు మండి పిచ్చోళ్లలా గల్లీ లీడర్ల కంటే స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతున్నారని వారి మాటలను నమ్మే పరిస్థితి లో ప్రజలు లేరన్నారు. టీఆర్ఎస్ పథకాలు,నాయకులపై ప్రతి పక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తే చూస్తు ఊర్కోమని తెలిపారు. ప్రధాని ఉచితాలు బంద్ చేయాలని మాట్లాడుతున్నాడని రాష్ట్రంలో రైతులు, ప్రజలు బాగు పడడం ప్రధానికి ఇష్టం లేనట్టు ఉందని చెప్పారు. ప్రజలు బీజేపీ నాయకులను బజారులో నిలబెట్టి బట్టలు ఊడదీసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పారు. బీజేపీ నాయకురాలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని గట్టు తిమ్మప్ప పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్, విజయ్‌కుమార్, రాజారెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్ పాల్గొన్నారు.