వైభవంగా పోలేపల్లి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు
జాతర ప్రాంగణం.. జనసంద్రం
లక్షకుపైగా తరలొచ్చిన భక్తులు
ఎల్లమ్మ తల్లికి పూజలు చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కోస్గి, ఫిబ్రవరి 25: డప్పుల మోతలు.. శివసత్తుల పూనకాలు.. బోనాలతో బైలెల్లిన మహిళలు.. భక్తుల కోలాహలం.. గవ్వల బండారోత్సవం..మధ్య కోస్గి మండలంలోని పోలేపల్లిలో వెలిసిన ఎల్లమ్మ తల్లి సిడె మహోత్సవం కనులపండువగా సాగింది. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఈ మహాఘట్టాన్ని నిర్వహించారు. వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్షకుపైగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి. తల్లి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అమ్మవారికి పూజలు చేశారు.
పోలేపల్లి ఎల్లమ్మతల్లి జాతరలో ప్రధానఘట్టం సిడె భక్తుల కోలాహాల మధ్యన అట్టహాసంగా సాగింది. ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తూ షిడెపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున పల్లకీలో ఆలయానికి చేరుకున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ తదితర ప్రాంతాలనుంచి భక్తులు అధికసంఖ్యలో తరలొచ్చారు. శివసత్తులు చేసిన విన్యాసాలు పలువురిని అలరించాయి. షిడెపై అమ్మవారు దర్శనమిస్తున్న సమయంలో భక్తులు గవ్వలబండారు చల్లుతూ దీవించమ్మా ఎల్లమ్మతల్లీ అంటూ జేజేలు పలికారు. షిడె ఘట్టాన్ని తిలకించేందుకు లక్షమందికి పైగా భక్తులు తరలొచ్చారు. జాతర ప్రాంగణంలో రంగులరాట్నం, తినుబండారాలు, చిన్నారుల ఆటవస్తువుల దుకాణాలు వెలిశాయి. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 200మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కోస్గి సీఐ జనార్దన్ తెలిపారు. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు అమ్మవారిని దర్శించుకొని బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఎల్లమ్మను దర్శించుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ వెంకటేశ్, కమిటీ సభ్యులు, మేనేజర్ రాజేందర్‌రెడ్డి, నాయకులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.