మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25 : రైతులకు పంట రుణాలు ఇప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2021-22 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యసాధనకు బ్యాం కర్లు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.167కో ట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.101కోట్లు రైతులకు రుణాలు ఇచ్చిన్నప్పటికీ.. మరిన్ని రుణాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీడీవోలు, తాసిల్దార్లు మండల పరిధిలోని బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రుణాలపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఉద్యాన పంటలకు సంబంధించి మల్బరీ సాగు చేస్తున్న రైతులకు బ్యాంకర్లు సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. కోయిలకొండ, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో మల్బరీసాగు అధికంగా చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యాన తోటలకు సైతం బ్యాంకర్లు రుణాలను అందించేందుకు చర్యలు తీ సుకోవాలన్నారు. మత్స్యశాఖ అమలు చేస్తు న్న కిసాన్ క్రెడిట్ కార్డులు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. వీసీలో ఎల్డీఎం నాగరాజు, నాబార్డు ఏజీఎం శ్రీనివాస్, రాజేంద్రసాద్, సుభాష్ ఉన్నారు.
అవగాహన కల్పించాలి
ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పల్స్‌పోలియో చుక్కలమందు వేయించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్స్‌పోలియోపై అవగాహన కల్పించేందుకు శనివారం ర్యాలీలు నిర్వహించాలని సూచించా రు. వ్యాక్సిన్‌కు సంబంధించి కోల్డ్‌చైన్ నిర్వహించే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల జాబితాను సంబంధిత విద్యుత్ ఏఈలకు అందజేయాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వీసీలో డీఎంహెచ్‌వో కృష్ణ, ఇమ్యూనైజేషన్ అధికారి శంకర్ ఉన్నారు.
ప్రతి మొక్కకూ నీరందించాలి
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకూ క్రమం తప్పకుండా నీరందించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నా రు. వాటరింగ్డే సందర్భంగా కలెక్టర్ క్యాం పు కార్యాలయ ఆవరణలో మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం వాటరింగ్డే నిర్వహించాలని సూచించారు. అధికారులు బా ధ్యతగా వాటరింగ్డేలో పాల్గొని అవగాహన కల్పించాలని తెలిపారు.