జోగులాంబ గద్వాల జిల్లాలో మట్టి దందా యథేచ్ఛగా జరగుతోంది. రాజకీయ పలుకుబడితోనే ఈ మట్టి బిజినెస్ జరుగుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఓ మాజీ ఛైర్మన్ కనుసన్నల్లో మట్టి వ్యాపారం కోట్ల రూపాయల్లో జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రకృతి వనరులకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు, వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని చెప్పే అధికారుల మాటలు, హెచ్చరికలు కార్యరూపం దాల్చకపోవడంతో గద్వాల జిల్లాలో యథేచ్ఛగా సహజ వనరుల ధ్వంసం జరుగుతోంది.
ఎలాంటి అనుమతులు లేకుండా నియోజకవర్గంలో ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. గద్వాల పట్టణంతో పాటు మరో రెండు మండలాల్లో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగుతున్నది. మాజీ ఛైర్మన్ తన అనుచరులనే వాహన డ్రైవర్లుగా నియమించి మట్టిని పబ్లిక్‌గానే తరలిస్తున్నా ఎవరూ ఏమీ పట్టనట్టే ఉంటున్నారు. మాజీ ఛైర్మన్ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి అధికారుల నోర్లు మూయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గద్వాలలో ఇసుక దందాను మించి అక్రమ మట్టి వ్యాపారం జరుగుతున్నదని, మాజీ ఛైర్మన్‌తో పాటు మరి కొంత మంది సిండికేట్‌గా పలాన ఉత్తరం వైపు నీది, దక్షిణం వైపు నాది అంటూ ఏరియాలుగా పంచుకుని ఈ మట్టి దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని జనం మాట్లాడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టే ఉంటున్నారు. ఈ అక్రమ దందాలో అధికారుల వాటా వారికి ముట్టుతన్నందునే వారు చూసీ చూడనట్టు నటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ అక్రమ మట్టివ్యాపారాన్ని అరికట్టి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ప్రజలు కోరుతున్నారు.