గద్వాల అర్బన్ : రైతులు తమ మామిడి చెట్ల కొమ్మలు కత్తిరించేందుకు జూన్, జులై మాసాలు అనువైన సమయమని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి అక్బర్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి పంట సమృద్ధిగా పండాలంటే ప్రతి సంవత్సరం మామిడి కోత అనంతరం చెట్టుకు 15 రోజులు విశ్రాంతి ఇచ్చిన తర్వాత కొమ్మలు కత్తిరించాలన్నారు. ఇలా చేయడం వల్ల చెట్టు లోపలికి గాలి, వెలుతురు, సూర్యరశ్మి చెట్టు అంత బాగా సోకి మంచి కాపునిస్తుందని సూచించారు.
చెట్ల నుంచి కాయలు కోసిన తర్వాత మిగిలిపోయిన తొడమలను కత్తిరించాలన్నారు. అలాగే ఎండు కొమ్మలను చీడపీడలు ఆశించిన కొమ్మలను మొదటి వరకు కత్తిరించి కొనులకు బోర్డో మిశ్రమాన్ని లేదా కాపర్ యాక్సి క్లోరైడ్ పూచి కత్తిరించిన, చెట్ల కింద రాలిన ఎండు కొమ్మలను పోగు చేసి తగలబెట్టాలని సూచించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఎదురు కొమ్మలను రంపంతో కోయాలి. పెద్ద కొమ్మలు కత్తిరించేందుకు మోటర్తో నడిచే రంపాన్ని ఉపయోగించాలి. కొమ్మలను కత్తిరించేటప్పుడు 45 డిగ్రీస్ కోణంతో కత్తిరించాలి. కొమ్మ కింది భాగం చీలకుండా చూసుకోవాలి. చిన్న చిన్న కొమ్మలను చేతి ద్వారా, కత్తిరించే సికేచర్ ద్వారా చేయాలని సూచించారు.