గద్వాల : పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పి గద్వాల నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించాలని బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ర్యాలంపాడు, గట్టు ఎత్తిపోతల పథకం, నెట్టంపాడు ప్రాజెక్టులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మొదలయ్యాయని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులపై ఉన్న మిగతా పెండింగ్ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు.
రేవంత్ రెడ్డి జిల్లాలో చేపడుతున్న పర్యటన అభివృద్ధి కోసం అయితే గద్వాల నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిన్న చిన్న కాలువల్లో చెట్లు మొలిచిన తొలగించని స్థితిలో ప్రభుత్వం ఉన్నదని మండిపడ్డారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా సీఎం పర్యటన కొనసాగడం సిగ్గుచేటు అని అన్నారు. సీఎం సమయం ఇస్తే గద్వాల నియోజకవర్గ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ తరపున వినతి పత్రం అందజేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కేశవ్, వెంకటరాములు, వెంకటేశ్వర రెడ్డి, జి.రాఘవేంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.