గద్వాల అర్బన్: ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, డంపింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు (Srinivasa Rao) హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు, క్రయవిక్రయాలు చేసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా ఇసుకను తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలను నిరోధించేందుకు ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ (PDPP) చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టం (Mines and Minerals Act) ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి
ప్రభుత్వ అనుమతులున్న వారికి మాత్రమే ఇసుక రవాణా చేయడానికి, విక్రయించేందుకు హక్కు ఉందని, ఇతరులెవరైనా ఇసుక రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రజలు సమాచారం అందించాలని, డయల్ 100, సంబంధిత పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.