అలంపూర్, మే 17: ప్రతి పౌరుడు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని అలంపూర్ (Alampur) సివిల్ కోర్టు జూనియర్ జడ్జి వైభవ్ మిథున్ తేజ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు సూచనల మేరకు శనివారం మండల న్యాయ సేవాసమితి ఆధ్వర్యంలో మానవపాడు మండలం మద్దూరులో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు హక్కులతోపాటు బాధ్యత కలిగి ఉండాలన్నారు. వరదలు వచ్చినప్పుడు, ఏదైన అగ్ని ప్రమాదాలు జరిగి స్థిర చర ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు కనిపించకుండా పోయినప్పుడు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి చెక్ చేసుకుని, నమోదు చేయించుకోవాలన్నారు. విద్యతోపాటు విజ్ఞానం వస్తుందని చెప్పారు.
ఆధునిక ప్రపంచంలో సౌకర్యాలు, కాలాన్ని బట్టి మనం కూడా జీవన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో పాటు వ్యాయామం చేస్తూ దినచర్యల్లో భాగంగా పౌష్టికాహారం తీసుకోవడంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. డబ్బు లావాదేవీల విషయంలో నోటి మాటలే కాకుండా పత్రాలు రాసుకోవడం వల్ల న్యాయపరంగా లబ్ధిపొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం సీనియర్ న్యాయవాదులు నారాయణ రెడ్డి, శ్రీదర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అద్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, గజేంద్ర గౌడ్, ముందు, వెంకటేష్, తదితరులు డ్రంక్ అండ్ డ్రైవ్, విత్తనం, ఎరువులు కొనుగోలు బిల్లులు, భూముల క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్, బాండ్ పేపర్,ప్రామిసరి నోట్ చెల్లుబాటు, భూముల క్రయవిక్రయాల సంబంధించి సాదా బైనామ, కౌలు రైతుల చట్టం, 12 సంవత్సరాలకు మించి ఒకే వ్యక్తికి భూమి కౌలుకు ఇవ్వొద్దు, ఆ రైతు పేరు కాస్తులో(అనుభవ దారుడుగా) నమోదు కావడం వల్ల రైతుకు భూమిపై చట్ట ప్రకారం హక్కు ఏర్పడుతుందని వివరించారు.
ఎస్ఐ తారక మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు గురించి వివరించారు. యువత మద్యానికి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. సమాజంలో మండల ఉచిత న్యాయ సేవలను అనాథలు, ఎస్సీ, ఎస్టీలు, ఏడాదికి రూ.3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న పౌరులు, యాచకులు సద్వినియోగం చేసుకునేందుకు అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కోర్టు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.