జోగులాంబ గద్వాల : సేకరించిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు జరగేలా ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం గద్వాల మండల కేంద్రంలోని గుర్రం గడ్డ ద్వీప గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి, మిగిలి ఉన్న ధాన్యం 17 శాతం తేమ రాగానే కాంటా వేసి మద్దతు ధరకు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం కాంటా వేసిన బస్తాలను మిల్లులకు ఎప్పటికప్పుడు వేగవంతంగా మిల్లులకు తరలించాలని సూచించారు.
జిల్లాలో ధాన్యం సేకరణ గతంతో పోల్చితే ఈ సంవత్సరం అధికంగా సేకరించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 100 కోట్ల రూపాయలను 10వేల 500 మంది రైతుల ఖాతాలకు నేరుగా జమ చేశామన్నారు. ఇప్పటి వరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తి చేసి, కొనుగోలు చేసిన 48 గంటలలోపు సంబంధిత రైతుల ఖాతాలకు నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మిగతా 10 శాతం ధాన్యాన్ని మూడు రోజులలో తూకం చేసి వాహనాల ద్వారా మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, ఏపీ డి నరసింహులు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.