
చిన్నారుల కోసం పోక్సో ఈ-బాక్స్
యాప్‌ను అమల్లోకి తీసుకొచ్చిన కేంద్రం
ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా..
ఇకపై బాధితులకు అండగా పోలీసులు
వనపర్తి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : అభం, శు భం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు.. మహిళలపై లైంగికదాడులకు చెక్‌పెట్టేందుకు ‘పోక్సో-ఈ-బాక్స్’ ఎంతో ఉపయోగపడుతున్నది. దాడుల నుంచి తప్పించుకునేందు కు బాలబాలికల కోసం నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్‌రైట్స్ వి భాగం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. మహిళలు, బా లబాలికలు నేరుగా ఫిర్యాదు చేసి రక్షణ పొందే అవకాశం కల్పించింది. ఏదైనా జరిగినప్పుడు భయంతో చాలా మంది ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు. దీంతో నేరస్తులు సులువుగా శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. కొందరు ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా.. బాధితులను వేధింపులకు గు రిచేస్తున్న సంఘటనలు చూస్తూనే ఉంటాం. ఇలాంటి వారి ఆట కట్టించి బాధితులకు న్యాయం చేయడంతోపాటు నేరగాళ్లను శిక్షించేందుకు వీలుగా ఫిర్యాదుదారుల వివరాలను రహస్యంగా ఉంచేందుకు యాప్ రూపొందించారు.
సులభంగా అప్లోడ్..
పోక్సో ఈ-బాక్స్ యాప్‌లో ఫిర్యాదును సులభంగా అప్లోడ్ చేయొచ్చు. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫో న్ ఉన్నది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియనందున బాలికలు, మహిళలు తమ సంరక్షణ కోసం ఈ యాప్‌ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైనా సమాచారం అందించొచ్చు. లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనలు తెలిస్తే యాప్‌లో అప్లోడ్ చేయొచ్చు.
ఢిల్లీ కేంద్రంగా పర్యవేక్షణ..
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోక్సో-ఈ-బాక్స్ యాప్‌లో వచ్చిన ఫిర్యాదులను ఢిల్లీ నుంచి ప్రత్యేక బృం దం పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదులను అక్కడి సంబంధిత అధికారులు స్త్రీ, శిశు సంక్షేమాధికారి రాష్ట్ర కార్యాలయానికి.. జి ల్లా కేంద్రానికి సమాచారం ఇస్తారు. బాలల సంరక్షణ అధికారి, సిబ్బంది వెంటనే విచారణ చేపడుతారు. క్షేత్రస్థాయి లో విచారణ చేస్తున్న అధికారులకు ఫిర్యాదు ఎవరు చేశార న్న సమాచారం కూడా తెలియదు. దీంతో కేసులో వంద శాతం పారదర్శకతతో న్యాయం జరుగుతుంది. కేసుకు సం బంధించిన విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారులకు రక్షణ, నేరానికి పాల్పడిన వారికి శిక్ష పడేలా ఈ యాప్ దోహదపడుతుంది. బాధితులకూ న్యాయం జరుగుతుంది.
హ్యాక్-ఐ మాదిరిగానే..
పోక్సో ఈ-బాక్స్ యాప్ హ్యాక్-ఐ మాదిరిగానే పనిచేస్తుంది. నేరాల నియంత్రణకు దోహదపడుతుంది. ముఖ్యం గా చిన్నారులు ఈ యాప్‌లపై అవగాహన పెంచుకోవాలి. బాలికలపై జరుగుతున్న అన్యాయాలను గుర్తించిన వెంటనే చిత్రీకరించి యాప్‌లో అప్లోడ్ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలి. ఫిర్యాదుదారుల వివరాలను ప్రభుత్వం పోలీస్ శాఖకు చేరవేస్తుంది. వాటి ఆధారంగా కేసును నమోదు చేసి నిందితుల ఆటకట్టించి బాధితులకు అండగా నిలుస్తున్నాం. తెలంగాణ పోలీస్ ఈ విషయంలో చాలా బెస్ట్. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తున్నాం.