
జాతీయరహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
కలెక్టర్ వెంకట్రావు
జడ్చర్లటౌన్/రాజాపూర్/బాలానగర్, డిసెంబర్ 29 : హరితహారంలో భాగంగా రూ.6.38కోట్ల వ్యయంతో 44వ జాతీయరహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు చెప్పారు. మహబూబ్‌నగర్ నుంచి బాలానగర్ వరకు జాతీయరహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని 62 కిలోమీటర్లమేర జాతీయరహదారికి ఇరువైపులా 49,754 మొక్కలు, రహదారి సెంట్రల్లైన్లో 54 కి.మీ. పొడవునా 51వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ, ఇతర శాఖల సహకారంతో చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ 44వ జాతీయరహదారిపై మొక్కలను పరిశీలించి సమీక్షించినట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి, సీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్నిశాఖల అధికారులు 44వ జాతీయరహదారిపై మొక్కల పెంపకాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జడ్చర్ల బస్టాండ్ వద్ద జాతీయరహదారి మధ్యలో వెంటనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని మున్సిప ల్, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మాచారం, రాజాపూర్, బాలానగర్ ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించి మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు క్రమం తప్పకుండా నీరు పోయాలని ఆయా మండలాల తాసిల్దార్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో గంగిరెడ్డి, జెడ్పీ సీఈవో జ్యోతి, ఎంపీడీవోలు జగదీశ్, లక్ష్మీదేవి, తాసిల్దార్ శంకర్, డిప్యూటీ తాసిల్దార్ వెంకటేశ్వరి, ఎంపీవో వెంకట్రాములు, సర్పంచుల సంఘం రాజాపూర్ మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, నరహరి, సత్యయ్య, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.