
జెడ్పీచైర్ పర్సన్ వనజాగౌడ్
జిల్లా పరిషత్‌లో సంఘాల సమావేశం
నారాయణపేటటౌన్, డిసెంబర్ 29: ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు కృషి చేయాలని జెడ్పీచైర్ పర్సన్ వనజాగౌడ్ అన్నారు. బుధవారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. 2,4వ స్థాయీ సంఘాల సమావేశాలకు జెడ్పీ చైర్ పర్సన్, 3వ స్థాయీ సంఘానికి వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి, 5వ స్థాయీ సంఘానికి జెడ్పీటీసీ జ్యోతి అధ్యక్షత వహించారు. 5వ స్థాయీ సంఘానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. జిల్లాలో గొర్రెలు, మేకలు పెంచుతున్న మహిళా సంఘాల సభ్యులను గుర్తించి లైవ్‌స్టాక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్‌లను ఏర్పాటు చేసినట్లు డీఆర్డీవో గోపాల్‌నాయక్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని 1035 మంది మహిళలకు నూతనంగా జీవనోపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా మార్చి నాటికి పెండింగ్ పనులను పూర్తి చేస్తామని కార్యనిర్వాహక అధికారి పుల్లారెడ్డి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.524.2 కోట్లతో భారీ, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పినట్లు పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ సుబ్బారెడ్డి తెలిపారు. జిల్లాలో 1,40,217 ఆహార భద్రతా కార్డులకుగానూ 2,792.470 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు పౌర సరఫరాలశాఖ మేనేజర్ హతీరాం తెలిపారు. 2021లో ప్రజాపంపిణీ బియ్యం అక్రమ రవాణా, నిల్వకు సంబంధించి 64 కేసులు, 63 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. 2021-22 సంవత్సరానికిగానూ జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో 100శాతం సబ్సిడీపై 21లక్షల29వేల రొయ్యపిల్లలను వదిలినట్లు మత్స్యశాఖ అధికారి తెలిపారు.