
విలేకరుల సమావేశంలో విప్ గువ్వల బాలరాజు
వంగూరు, డిసెంబర్ 29 : డిండి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రై తులకు పరిహారం అందడంలో ఆలస్యమైనా వారు ఎంతో సహనంగా ఉన్నారని, వారి ఓపికకు చేతులెత్తి మొక్కుతున్నానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీఎల్ఐలో భూములు కోల్పోయిన 400 మందికిపైగా రైతుల ఖాతాల్లో సుమారు రూ.28 కోట్ల పరిహారం జమ అయిందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన నూతన ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నా మీద నమ్మకంతో పరిహారం అందనప్పటికీ కాలువలు తవ్వడానికి అంగీకరించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూస్తుందన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టిన సమయంలో వాటిని విమర్శించిన పార్టీలు నేడు ఈ ప్రాంతంలో ఇంకా ఉండడం మన దౌర్భాగ్యమన్నారు. వివిధ పార్టీల నేతలు డీఎల్ఐ, కేఎల్ఐలో భూములు కోల్పోయిన రైతులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వారి ఆటలకు ఇక నూకలు చెల్లవన్నారు. అగ్రిమెంట్ చేయని రైతులకు సైతం త్వరలో పరిహారం అందేలా చూస్తానన్నారు. డీఎల్ఐలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించిన సీఎం కేసీఆర్‌కు రైతుల తరఫున విప్ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరేందర్‌రావు, రాజేందర్‌రెడ్డి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లాలూయాదవ్, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్‌తోపాటు నేతలు పుల్లయ్య, ఆనంద్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నర్సిరెడ్డి, అంజి, రాజారంగారావు, హరినాథ్, మల్లేష్, నాగేష్, జంగయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.