
జడ్చర్ల, డిసెంబర్ 29 : రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుం టే, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పాకులాడుతున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాం సుందర్రెడ్డితోపాటు ముగ్గురు డైరెక్టర్లతో మార్కెట్ కార్యదర్శి నవీన్‌కుమార్ ప్రమాణం చేయించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొంటుంటే.. ఎఫ్‌సీఐ మాత్రం కొనుగోలు చేయమని చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు వరి వేయాలని సూచిస్తున్నారని, కానీ కేంద్రం మాత్రం ధాన్యం కొనుగోలు చేయబోమని కరాఖండిగా చెబుతున్నదన్నారు. అలాంటప్పుడు కమలం పార్టీ నాయకులు ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం నుంచి రాతపూర్వకంగా హామీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ రాష్ట్ర మాజీ చైర్మన్ బాద్మి శివకుమా ర్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మాజీ వైస్‌ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జంగయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు లక్ష్మయ్య, మురళి, సుభాష్, శ్రీనివాస్‌రెడ్డి, ఇమ్మూ, శ్రీకాంత్, సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.