
రెండో రోజూ రెండెకరాల్లోపు..
రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం
2,61,393 మంది అన్నదాతలకు లబ్ధి
అందిన రూ.192,65,72,292 సాయం
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మహబూబ్‌నగర్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుబంధు సాయం కర్షకుల మోములో చిరునవ్వు చిందిస్తున్నది. రెండో రోజు ఎకరం నుంచి రెండెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమైంది. మొదటి రోజు ఉమ్మడి జిల్లా పరిధిలో 2,25,212 మంది రైతుల ఖాతాల్లో రూ.70,12,30,928 ప్రభుత్వం జమ చేసింది. ఇక రెండో రోజు 2,61,393 అన్నదాతలకు సంబంధించి రూ.192,65,72,292 జమయ్యాయి. రెండు రోజుల్లో 4,86,605 రైతులకుగానూ రూ.262,78,03,220 పడ్డాయి. డబ్బులు జమైనట్లు సెల్ఫోన్లకు అలా మెసేజ్‌లు రాగానే రైతులు బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకున్నారు. సాయం చేతిలో పడగానే సంబురాల్లో మునిగిపోయారు. ఉమ్మడి జిల్లాలోని పలువురు రైతులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి ఫ్లెక్సీపై వేరుశనగలతో అభిమానాన్ని చాటుకున్నారు.
రైతుబంధు సాయం రెండో రోజూ అన్నదాతల ఖాతాల్లో జమైంది. తొలి రోజు ప్రక్రియలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2,25,212 మంది ఖాతాల్లో రూ.70,12,30,928 జమ కాగా.. రెండో రోజు 2,61,393 రైతులకు రూ.192,65,72,292 జమయ్యాయి. రెండు రోజుల్లో 4,86,605 రైతుల ఖాతాల్లో రూ.262,78,03,220 జమయ్యాయి. తొలి రోజు ఎకరాలోపు రైతులకు సాయం అందించగా.. రెండో రోజు ఎకరా నుంచి రెండు ఎకరాల్లోపు వారికి డబ్బులు అందాయి. మెసేజ్‌లు రావడం రైతులు బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకున్నారు. రైతుబంధు సాయం అందించి తమను ఆదుకుంటున్నందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకం చేశారు.
పెట్టుబడి తిప్పలు తప్పినవి..
గతంలో పంట పెట్టుబడికి అప్పులు చేసేవాళ్లం. రైతుబంధుతో పెట్టుబ డి తిప్పలు తప్పినవి. సాగుకు డబ్బులు అవసరమైతే అప్పు చేసేందుకు తిరిగి తిరిగి ఎక్కడో ఒక చోట తెచ్చేవాళ్లం. ఇప్పుడు రైతుబంధు డబ్బులు వస్తుండడంతో సంతోషంగా సాగు చేసుకుంటున్నాం. ఏడాదికి రెండు సా ర్లు బ్యాంకులో పైసలు పడుతుండడంతో ఎవుసం చేయాలన్న ఆసక్తి పెరిగింది. గతంలో డబ్బులు లేక రెండెకరాలు బీడుగా ఇడిచిపెట్టేవాడిని. పొ ట్టకూటి కోసం పట్టణాలకు వెళ్లి కూలీ పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తుండేవాడిని. మూడు, నాలుగేండ్ల నుంచి సొంత ఊరిలో చేను పని చేసుకుంటూ హాయిగా బతుకుతున్న. రైతుబంధుతో ధైర్యం పెరిగింది.-కె.వెంకటయ్య, రైతు, వెన్నాచేడ్ గ్రామం, మహ్మదాబాద్ మండలం
ధైర్యం పెరిగింది..
నాకు 26 గుంటలు ఉన్నది. అందులో వ్యవసాయం చేసేందుకు అప్పు కోసం తిరిగితే ఎవ్వరూ ఇచ్చేవారు కాదు. ఇచ్చినా పంట పండితే ఆయనకు కట్టడానికే సరిపోయేది. కానీ గిప్పుడు అప్పు చేయాలనే కుదెన లేకుండా పోయింది. పంట సాగు చేసేదుకంటే ముందే పెట్టుబడికి సీఎం కేసీఆర్ డబ్బులు ఇస్తుండడంతో ధైర్యం పెరిగింది. ఆ డబ్బులను పెట్టుబడికి వాడుతున్నా. బ్యాంకులోనే డబ్బులు వేస్తుండడంతో చాలా మేలు జరుగుతుంది.-ఎర్ర వెంకటయ్య, రైతు, వేముల గ్రామం, మూసాపేట మండలం
పైసల చింత తీరింది..
సీఎం కేసీఆర్ సారు పంట సాగుకు ముందే పైసలు వేస్తున్నారు. దీంతో పెట్టబడి యాడ తేవాలనే ఆలోచన లేకుండా పోయింది. మా పేరుపై ఉన్న బ్యాంకులోనే డబ్బులు పడుతుండడంతో పెట్టుబడి చింత తీరింది. నాకున్న ఎకరా పొలంలో గత వానకాలంలో వచ్చిన డబ్బులతో పత్తి సాగుచేసిన. గిప్పుడు మళ్లీ రైతుబంధు కింద రూ.5 వేలు వచ్చినవి. అందుకే ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నాం.-లండు నాగన్న, రైతు, వేముల గ్రామం, మూసాపేట మండలం