జెడ్పీ చైర్పర్సన్ సరిత
మానవపాడు, జూలై 1: గ్రామాల్లో విరివిగా మొక్కలు పెంచి పల్లెలు పచ్చదనంతో కళకళలాడేలా చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. గురువారం మండలంలోని కలుకుంట్ల గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న సబ్ సెంటర్ భవనానికి ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రూ.12.90 లక్షలతో నిర్మిస్తున్న భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని గుత్తేదారును ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయించిందని ఈ నిధులను శాశ్వత పనులు చేపట్టేందుకు వినియోగించుకోవాలన్నారు. కలుకుంట్ల గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ ఆత్మలింగారెడ్డికి సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలకు విశేష అధికారాలతో పాటు నిధులు కేటాయించారని ఈ నిధులు వినియోగించుకొని గ్రామాల అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం జెడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యేలు రైతు వేదిక, జాతీయ రహదారి వద్ద హరితహారం కార్యక్రమాన్ని పరిశీలించి మొక్కలు నాటారు.
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దళితులను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు కేటాయించే పథకాన్ని ప్రవేశపెట్టనుండడం చాలా సంతోషమని సీఎంకు దళితులు ఎప్పుడూ రుణపడి ఉంటారని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే , జెడ్పీ చైర్పర్సన్ క్షీరాభిషేకం చేశారు.అలాగే డాక్టర్స్ డే సందర్భంగా మానవపాడు ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సవితను ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ శాలువాతో సన్మానించారు.