ఈ ప్రాంతం కవులు, కళాకారులకు నిలయం
ఉద్యమ గడ్డగా గుర్తింపు పొందిన జిల్లా
సబ్బండ వర్గాల కృషితోనే స్వరాష్ట్ర సాధన
జీవిత సాఫల్యాల పురస్కారాల ప్రదానం అభినందనీయం
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ టౌన్, ఫిబ్రవరి 20 : కందనూలు ప్రాంతం సాహిత్యానికి కందెనలాంటిదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర గణనీయమైందని గుర్తు చేశారు. కవులు, కళాకారులు, మేధావులు, సబ్బండ వర్ణాల కృషితోనే స్వరాష్ట్రం సిద్ధించిందని ఆయనన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీఎన్ఆర్ పాఠశాలలో చింతలపల్లి నిర్మలాదేవి నారాయణరావు 2021-22 జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవ సభకు సీఎన్ఆర్ విద్యాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు భాస్కర్‌రావు అధ్యక్షత వహించగా.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ ప్రాంతం కవులు, కళాకారులు, ఉద్యమాలకు నిలయమన్నారు. సామాజిక రంగంలో విశేష కృషి చేసిన సామాజికవేత్త దుశర్ల సత్యనారాయణ అన్నారు. ఆయనకు సాహిత్య రంగంలో గొప్ప కవి నాళేశ్వరం చింతలపల్లి నిర్మలాదేవి నారాయణరావు జీవన సాఫ్య పురస్కారం ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. సత్యనారాయణ జలసాధన సమితి తరుపున ఫ్లోరోసిస్ నిర్మూలనకు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో సాగునీటి కోసం ఉద్యమాలు నడిచాయని తెలిపారు. ఎంజీకేఎల్ఐ సాగునీటి రాకతో వలస వెళ్లిన బతుకులన్నీ తిరిగి వచ్చాయన్నారు.
సాగునీటితో సస్యశ్యామలం కావడంతో రాష్ట్రంలోని కవులతో జలకవితోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. వానకాలంలో నీళ్లు దొరకని ఉమ్మడి జిల్లాలో మండు వేసవిలో సైతం చెరువులు అలుగులు పారించి చూపించామని మంత్రి పేర్కొన్నారు. దేశంలో అత్యధిక పంటల ఉత్పత్తి తెలంగాణలో ఉందన్నారు. ధాన్యం కొనమని చేతులెత్తేసే పరిస్థితి కేంద్రానికి వచ్చిందంటే నీటి ప్రవాహం పాత్ర మన జీవనంలో ఎంతుందో తెలుసుకోవచ్చన్నారు. అవార్డుల పరంపరను కొనసాగించాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సమాజహితులకు, కవులకు, తల్లిదండ్రుల పేరు మీద అవార్డులు ఇవ్వడం సంతోషకరమన్నారు. పురస్కారం పొందిన కవులను ఆయన అభినందించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌తో, సీఎన్ఆర్ స్కూల్‌తో, భాస్కర్‌రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. లౌకిక ప్రజాస్వామ్య విలువలకు కలిసికట్టుగా మతోన్మాదానికి వ్యతిరేకంగా పని చేయాలన్నారు. మానవీయ సమాజం కోసం కృషి చేయాలని కోరారు. అవార్డు గ్రహీతలైన దుశర్ల సత్యనారాయణ, నాళేశ్వరం శంకరాన్ని మంత్రి, ఎమ్మెల్యేతోపాటు తెలంగాణ సాహిత్య ఆకాడమీ చైర్మన్ గౌరీశంకర్ సత్కరించారు. మెమోంటో అందించి రూ.25 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యదర్శి మదన్మోహన్, బాల్‌రాం, రాంచందర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నేత జక్కా రఘునందన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనా భాస్కర్‌గౌడ్, నిర్వాహకులు రమేశ్‌బాబు, సుబ్బయ్య, దినకర్, బాలీశ్వర్, మద్దిలేటి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.