స్పర్శదర్శనం కోసం తరలివస్తున్న భక్తులు
క్యూలైన్లలో సిబ్బందితో వాగ్వాదం
శ్రీశైలం, ఫిబ్రవరి 20: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ర్టాల నుండి స్పర్శ దర్శనం కోసం వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునుంచి క్యూలైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు యాత్రికులు చెబుతున్నారు. క్యూలైన్లు కంపార్ట్మెంట్లలో గంటల తరబడి వేచి ఉండాల్సివస్తుందని యాత్రికులు వాగ్వాదానికి, ఘర్షణకు దిగారు. భక్తులు దర్శన వేళల్లో ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ అధికారులు చెప్పారు. తెల్లవారుజామున ఆచరించే నదీస్నానాలను పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. అన్నప్రసాద ప్యాకెట్ల వితరణ, క్యూలైన్లలో దర్శనానికి వేచి ఉండే భక్తులకు పాలు, తాగునీరు, అల్పాహార పొట్లాలు అందిస్తున్నట్లు పీఆర్ఓ శ్రీనివాసరావు తెలిపారు. విద్యుద్దీపకాంతులతో అలరారుతున్న ఆలయ శోభను వీక్షిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులవుతున్నారు. క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడికి స్వామిఅమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నట్లు ఈవో లవన్న తెలిపారు.
స్పర్శ దర్శనం రద్దు
శ్రీశైల మల్లన్న గర్భాలయ స్పర్శదర్శనం నిలిపివేసినట్లు ఈవో లవన్న స్పష్టం చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రద్దీ దృష్ట్యా మంగళవారం నుంచి మార్చి నాల్గో తేదీ వరకు స్పర్శ దర్శనాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఇరుముడితో ఉన్న శివస్వాములకు మాత్రమే గర్భాలయ ప్రవేశం, స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. మండల దీక్షలు చేసుకుని క్షేత్రానికి ముడుపులు చెల్లించేందుకు వస్తున్న శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి స్వామిఅమ్మవార్ల దర్శనాలు కల్పిస్తున్నామని చెప్పారు. అదే విధంగా యాత్రికులు కూడా దేవస్థానం సిబ్బందికి సహకరించాలని ఈవో కోరారు.