కనులపండువగా ధన్వంతరి వేంకటేశ్వరస్వామి కల్యాణం
రథంపై ఊరేగిన స్వామివారు
అయిజ, ఫిబ్రవరి 16: మండలంలోని ఉత్తనూరులో వెలిసిన ధన్వంతరి వేంకటేశ్వరస్వామి కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో శ్రీదేవీ, భూదేవీ సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామికి వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణం జరిపించారు. అనంతరం రథంపై ఆశీనులై భక్తులను అనుగ్రహించారు. కల్యాణంలో భక్తులు ఆశేషంగా పాల్గొని కల్యాణాన్ని కనులారా చూసి తరించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్నొన్నారు.
లక్ష్మీనరసింహుడి కల్యాణం.. కమనీయం
మున్సిపాలిటీలోని రంగుపేటలో కొలువు దీరిన మద్ధిలేటి లక్ష్మీనరసింహుడి ఉత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణం కమనీయంగా జరిపించారు. అందంగా అలంకరించిన పందిరిలో మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, భాజభజంత్రీల నడుమ మద్ధిలేటి లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీదేవీ మెడలో మాంగళ్యధారణ చేశారు. భక్తులు ఆశేషంగా పాల్గొని కల్యాణం కనులారా చూసి తన్మయత్వం చెందారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ , భక్తులు పాల్గొన్నారు.
కట్టకింద తిమ్మప్పస్వామికి కల్యాణం
వేదపండితుల మంత్రోచ్ఛరణలు.. మంగళవాయిద్యాలు.. భాజాభజంత్రీలు .. భక్తుల గోవింద నామస్మరణల నడుమ కట్టకింద తిమ్మప్పస్వామి కల్యాణం కనులపండువగా జరిపించారు. కట్టకింద తిమ్మప్పస్వామి మాఘశుద్ధ పౌర్ణమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 11 గంటలకు శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారికి అభిషేకం, అలంకరణ, అర్చనలు చేసిన అర్చకులు, శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామిని కల్యాణానికి ముస్తాబు చేశారు. రాత్రి గణపతి హోమం అనంతరం వేదపండితులు, ప్రత్యేకంగా అలంకరించిన పందిరిలోకి మంగళవాయిద్యాల నడుమ భక్తులు శ్రీవారిని తీసుకొచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శ్రీదేవీ, భూదేవీకి వేంకటేశ్వరస్వామి జీలకర్ర బెల్లం పెట్టారు. రాత్రి 11గంటలకు మాంగళ్యధారణ చేశారు. కల్యాణ తంతును భక్తులు కనులారా చూసి తరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. బుధవారం రాత్రి రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.