మహబూబ్‌నగర్, మే 3: లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ బోయపల్లిలోని న్యాక్ అకాడమీలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 1,4 ఉద్యోగాలకు నిరుద్యోగ ఎస్టీ యువతకు ఉచిత కోచింగ్ కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు అత్యధికంగా జారీ అవుతున్నాయని, నిరుద్యోగ యువత కష్టపడి చదివి ఉద్యోగాలు పొందాలని సూచించారు. వంద మందికి పైగా షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన నిరుద్యోగులకు కోచింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
శిక్షణకు వచ్చిన వారికి ఉచిత భోజనంతోపాటు అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో గిరిజన ఉద్యోగులకు వర్కింగ్ ఉమెన్స్ వసతి గృహంతోపాటు స్టేడియం పక్కనే బాలికల కళాశాల వసతి గృహం, గిరిజన భవనం, సేవాలాల్ మహరాజ్ దేవాలయం, వంటి వాటిని రూ.14 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. తండాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవర్, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, డీటీడీవో క్షత్రునాయక్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.