అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష
అంబర టౌన్షిప్పై అవగాహన సదస్సు
గద్వాల జెడ్పీసెంటర్, ఫిబ్రవరి 18: రాజీవ్ గృహకల్ప నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అంబరటౌన్షిప్లో మౌలిక వసతులు కల్పిస్తామని అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలోని అగ్రహారం రోడ్డులో అంబర టౌన్షిప్ పేరిట గృహనిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. టౌన్షిప్లో మొత్తం 622 ఇండ్లు కేటాయించామని తెలిపారు. గతంలో 420 ఇండ్లు రిజర్వ్ చేయబడినట్లు తెలిపారు. ఇప్పుడు 202 గృహాలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు, అందుకు సంబంధించిన విధివిధానాలు వివరించారు. వేలంపాటలో పాల్గొనేవారు కలెక్టర్ పేరుమీద రూ.10వేల డీడీ తీసి కలెక్టర్రేట్లో దరఖాస్తు సమర్పించి టోకెన్ పొందాలన్నారు. మార్చి 13న సాయం త్రం వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మార్చి 14, 15, 16తేదీల్లో బహిరంగ వేలంలో గృహాలను కేటాయిస్తామన్నారు. చదరపు గజం రూ.5,500కాగా ప్లాట్లను దక్కించుకొన్నవారు మొత్తం నగదులో 33శాతం చొప్పున 45రోజుల కాలవ్యవధిలో మూడు విడుతల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేలంలో పాల్గొని ప్లాట్దక్కని వారికి తమ డీడీ చెల్లించిన నగదు రూ.10వేలు తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి కంతు చెల్లించిన తర్వాత కోరినవారికి బ్యాంకు రుణం పొందేందుకు ఎన్వోసీ సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుందన్నారు. మళ్లీ మార్చి 7వతేదీన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మిగతా వివరాలు, సందేహాలకు హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు, జెడ్పీ సీఈవో విజయనాయక్, హెచ్ఎండీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
గద్వాలటౌన్, ఫిబ్రవరి 18: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకుగానూ రూపొందించిన ప్రత్యేక ప్రణాళికను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. జిల్లాకేంద్రంలోని బాలభవన్‌లో ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రణాళిపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రతి సబ్జెక్టు క్షుణ్ణంగా అర్థమయ్యేలా విద్యార్థులకు బోధించాలన్నారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని సూచించారు. ఒత్తిడి చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో చదివేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ఏస్తేర్రాణి, జిల్లా సెక్టోరల్ అధికారి హంపయ్య, విష్ణువర్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.