నేటినుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రేపు రథోత్సవం, 23న శకటోత్సవం, 24న పుట్టసేవ, 25న ఉత్సవాలు
భూత్పూర్, ఫిబ్రవరి 20: మండలకేంద్రంలోని జాతీయరహదారి పక్కన ఉన్న మునిరంగస్వామి జాతర సోమవారం నుంచి ప్రారంభం కానున్నందున ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. మునిరంగస్వామి విష్ణువుకు ప్రతిరూపం అని, పేదల ఉద్దరణకు జన్మించిన మహానుభావుడని భక్తుల నమ్మకం. మునిరంగస్వామి గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్లో జన్మించినట్లు కథలు, పాటల రూపంలో చెబుతారు. నమ్మిన భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడని భక్తుల విశ్వాసం. మునిరంగస్వామిని చింతలు తొలగించే చింతల మునిరంగడని కూడా అంటారు. ఆనాటి ప్రజల్లో అంటరానితనాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో విష్ణువు ప్రదర్శించిన చిన్న లీల అని కొందరు భావిస్తున్నారు. ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. ఐదేండ్ల కిందట అప్పటి ఆలయ కమిటీ, సర్పంచ్ శోభారత్నం ఆలయం ముందుభాగంలో గణపతి విగ్రహం, ఆలయం ఎదుట ధ్వజస్తంభం, వేణుగోపాలస్వామి విగ్రహం, నవగ్రహాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. జాతరకు మండల ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలాల ప్రజలతోపాటు హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చి మొక్కులను చెల్లించుకుంటున్నారు.
బ్రహ్మోత్సవాల్లో నిత్య కార్యక్రమాలు
సోమవారం మొదటిరోజున స్వామివారి ఊరేగింపు, మంగళవారం రాత్రి 10గంటలకు స్వామివారి రథోత్సవం(తేరు), 23న సాయంత్రం 5గంటలకు శకటోత్సవం, 24న గురువారం పుట్టసేవ, 25న శుక్రవారం స్వామివారి ఉత్సవాలు, 26న శనివారం స్వామివారి కల్యాణోత్సవం, 27న ఆదివారం స్వామివారి పల్లకీసేవ, 28న స్వామివారికి అవభృతాభిషేకం, ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. అదేవిధంగా నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి బోరింగ్ నర్సింహులు, కమిటీ సభ్యులు తెలిపారు.