అనాదిగా ఆచారాలకు నిలయం..
సిడె ఘట్టం ఇక్కడ ప్రధానం
బోనమెత్తి..మొక్కులు చెల్లించుకోనున్న భక్తులు
ఫిబ్రవరి 25న అమ్మవారి జాతర
తరలిరానున్న నాలుగు రాష్టాల ప్రజలు
కోస్గి, ఫిబ్రవరి 20: కొలిచే భక్తుల కోర్కెలు తీర్చే తల్లి పోలెపల్లి ఎల్లమ్మ. బోనమెత్తి..కోళ్లు మేకలు బలిచ్చి కల్లు సాక పట్టి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినానికి ముందు శుక్రవారం అమ్మవారి జాతర నిర్వహిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాలకు హాజరవుతారు.
వెలిసిన ఘట్టం
ఓ రైతు గుంటుకపై ఓ రాయిని ఉంచి పొలం సాగుచేసేవాడు. ఇదే క్రమంలో గుంటుకపై ఉన్న రాయిని సాయంకాలం ఎక్కడ వేసినా ఉదయం వచ్చి చూసేసరికి వేసిన స్థానంలో కాకుండా మరో స్థానంలో ఉండటం రైతును ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా నాలుగైదు రోజులు జరగడంతో ఓ రోజు రాత్రి కాపలా ఉండి చూడగా అర్ధరాత్రి 12గంటలకు అమ్మవారు తెల్లచీరతో గుంటకపైనుంచి లేచి యధా స్థానానికి వెళ్లి రాయిగా మారి కూర్చున్నది. ఈ విషయం గ్రామస్తులకు తెలుపగా నమ్మలేదు. వారిని నమ్మించడానికి మరుసటిరోజు అందరూ కాపలా ఉండగానే రాత్రి 12గంటలకు అలాగే వెళ్లి కూర్చున్నది. వెంటనే గ్రామస్తులు చిన్న ఆలయం నిర్మించి..ఎల్లమ్మతల్లి స్థానమని చెప్పి..ఇక్కడకు వచ్చిన భక్తుల కోర్కెలు తీరుతాయని పేర్కొన్నారు. ఇలా క్రమక్రమంగా ఆలయం అభివృద్ధి చెందిందని చరిత్ర చెబుతున్నది.
సిడె ఘట్టం
ఎల్లమ్మ తల్లి ఆలయం వెలసి సుమారు 152 సంవత్సరాలైంది. అప్పటినుంచి ఇప్పటివరకు అమ్మవారి ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. 1979 సంవత్సరంలో అమ్మవారి ఆలయం ప్రభుత్వ పరిధి దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆలయ అభివృద్ధిని ప్రభుత్వమే చూస్తున్నది. గతంలో అమ్మవారి జాతరకు ఓ జోగినిని చెట్టుకు వేలాడదీసి తాడుతో లాగుతూ ఆలయం చుట్టూ తిప్పేవారు. ఈ ఆచారాన్ని 2007లో అప్పటి ప్రభుత్వం అలా మహిళను చెట్టుకు కట్టితిప్పడం చట్టవిరుద్ధమని తేల్చింది. తొట్లెలో కూర్చోబెట్టి రథాన్ని ఆలయం చుట్టూ తిప్పాలని ఆదేశించడంతో అలా రెండు సంవత్సరాలు నిర్వహించారు. ప్రస్తుతం తొట్లెలో అమ్మవారి మూలవిరాట్ను ఉంచి తిప్పుతుంటే భక్తులు గవ్వల బండారు చల్లుతూ దర్శించుకుంటారు. ఈఘట్టాన్నే సిడె ఘట్టం అని పిలుస్తారు. గవ్వలు, పసుపు కలిపిన గవ్వల బండారును అమ్మవారికి సమర్పిస్తే కోర్కెలు తీరుతాయని ప్రసిద్ధ్ది.
బోనమెత్తి..
మహిళలు కుమ్మరి కుండ లేదా ఇత్తడి బిందెను తీసుకొని చుట్టూ సున్నంపూసి ఐదు బొట్లుపెట్టి అందులో అన్నం కుడుములు పెట్టి వేపకొమ్మలతో కుండను బోనంగా అలంకరిస్తారు. బోనాన్ని నెత్తిన పెట్టుకొని మహిళలు అమ్మవారి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా కోళ్లు మేకలను బలిస్తారు. ఈఏడాది ఫిబ్రవరి 25న శుక్రవారం జాతర ఉత్సవాలు ఫిబ్రవరి 26న జల్ది ఊరేగింపు రథోత్సవం జరుగనున్నాయి.