జాతీయ స్థాయిలో 130వ స్థానం
ఉమ్మడి జిల్లాలో ఏకైక గ్రామం
ఎంపిక చేసుకున్న ఎంపీ రాములు
అభివృద్ధి దిశగా మారుమూల పల్లె
తాజాగా రూ.1.50కోట్ల నిధులు
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): మారుమూల కుగ్రామం బొందలపల్లికి మహర్దశ పట్టనున్నది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకానికి ఎంపికైంది. ఎంపీలు దత్తత తీసుకొని గ్రామాభివృద్ధికి కృషి చేయడం ఈ పథకం ఉద్దేశం. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. అయితే జాతీయ స్థాయిలో 700 గ్రామ పంచాయతీలు ఎంపికకాగా 130వ స్థానంలో ఉమ్మడి జిల్లాలో ఏకైక పంచాయతీగా ఎన్నికైంది. దీంతో రాబోయే కాలంలో ఈ పల్లెకు మంచి రోజులు రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 11న సంసద్ ఆదర్శ గ్రామ యోజన(సాగీ) పథకం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రతి లోక్‌సభ సభ్యుడు తన పార్లమెంట్ పరిధిలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎంపీ పోతుగంటి రాములు తన పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోకవర్గంలోని బొందలపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకొన్నారు.
గ్రామంలో ఇప్పటికే..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లె ప్రగతితో పాటుగా 14,15వ ఆర్థిక సంఘాల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పల్లె ప్రకృతి వనం, వన నర్సరీ, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డులు పూర్తికాగా వ్యవసాయ కల్లాలు, పశువుల పాకలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లులాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సర్పంచ్ మల్లేపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ప్రస్తుతం రూ.కోటి ఖర్చుతో భూగర్భ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.8లక్షల వరకు ఖర్చు చేశారు. గతేడాది నాగసముద్రానికి నీళ్లు వెళ్లే చోట బ్రిడ్జి నిర్మించారు. ప్రస్తుతం సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నారు.
పథకానికి ఎంపిక ఇలా..
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి కేవలం 7కిలో మీటర్ల దూరంలో ఉన్నా..మారుమూల ప్రాంతాన్ని తలపిస్తుంది. దీంతో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంపీ రాములు సాగీ పథకంలో భాగంగా గతేడాది దత్తత తీసుకొన్నారు. అప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులతో జాతీయ స్థాయిలో కేంద్రం సర్వే చేపట్టగా పథకంలో భాగంగా ఎంపికైన 700వరకు పంచాయతీల్లో గ్రామానికి 130వ స్థానం దక్కడం విశేషం. గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ ర్యాంకును కేటాయించారు. వంద మార్కులతో కూడిన సర్వేలో గ్రామంలో పర్యావరణ పరిరక్షణ, గ్రామ సభ నిర్వహణ, జిల్లా స్థాయి సమావేశాలు, మౌలిక వసతుల కల్పన, శాంతిభద్రతలు, వలసలు తగ్గించడం, జీవన ప్రమాణాలతో జీవించడంలాంటి అంశాలను సేకరిస్తారు.
ఉమ్మడి జిల్లాలో ఒకే గ్రామం..
ఉమ్మడి పాలమూరులో ఈ గ్రామం ఒక్కటే ఇలా ఎంపికై మంచి ర్యాంకును సాధించింది. ఈ పథకంలో భాగంగా ప్రస్తుతం అమలు జరుగుతున్న పథకాలను వేగంగా, పూర్తిస్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిసరాలు, చేతివృత్తులను కొనసాగించడంతో పాటుగా గ్రామ సమగ్రాభివృద్ధికి జాతి గౌరవం, దేశ భక్తి, సామాజిక స్పృహ, మహిళాగౌరవంలాంటి జాతీయ భావాలు పెంపొందించడం కూడా జరుగుతుంది. అలాగే వంద శాతం ఇమ్యూనైజేషన్, మాతాశిశు మరణాలు అరికట్టడం, ఉపాధి హామీలాంటి ప్రభుత్వ పథకాల సక్రమ వినియోగం జరిగేలా చూడటం జరుగుతుంది. అలాగే కార్పొరేట్ సర్వీస్ సేవా పథకంలో భాగంగా నిధులను తీసుకొచ్చి గ్రామాన్ని రాబోయే కాలంలో అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే అధికారులు గ్రామంలో ఓసారి సందర్శించి చేపట్టాల్సిన పనులపై అంచనాలు రూపొందించారు. ఇటీవలే గ్రామానికి రూ.1.50కోట్ల నిధులు మంజూరయ్యాయి. త్వరలో ఈ నిధులతో చేపట్టబోయే పనులపై అధికారులు ప్రణాళికలు తయారు రూపొందించనున్నారు. కాగా త్వరలో ఎంపీతో పాటుగా ఎమ్మెల్యే, కలెక్టర్‌లాంటి ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనుల ప్రగతిపై పూర్తిస్థాయిలో చర్యలు, కార్యాచరణ రూపొందించనున్నారు. మొత్తం మీద బొందలపల్లి గ్రామానికి త్వరలో మంచిరోజులు రాబోతున్నాయి.