ఉండవెల్లి, జూలై 4 : జాతీయ రహదారిపై నాటిన ప్రతిమొక్కకూ ట్రీగార్డు ఏర్పా టు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మానవపాడు, ఉండవెల్లి మండలాల పంచాయతీ కార్యదర్శులతో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన మూడు వరుసలుగా మొక్కలు నాటి, వాటికి ట్రీగార్డు, స్టిక్లను ఏర్పాటు చేయాలన్నారు. మొక్కలకు ప్రతిరోజూ నీటిని అందించి పూర్తి స్థాయిలో సంరక్షించాలన్నారు. రాయిచూర్ రోడ్డువెంట, జాతీయ రహదారి వెంట శనివారం లోగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటించాలని ఎంపీడీవోలకు ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు పీడీ నాగేంద్రం, ఎంపీడీవోలు రమణారావు, జెమ్లానాయక్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధి కోసమే పల్లెప్రగతి
గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, జెడ్పీ సీఈవో విజయనాయక్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి కావాలంటే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో పని చేయాలన్నారు.
అనంతరం కార్యాలయం ఎదుట మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాఘవ, ఎంపీవో సయ్యద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.