జడ్చర్ల మండలం బండమీదిపల్లిలో 24
డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం
సర్కార్ నిధులు 1.25 కోట్ల ఇండ్లు అందడంతో లబ్ధిదారుల్లో ఆనందం
పేదల సొంతింటి కల సాకారం
ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 20;సొంతింటికి రావడం ఆనందంగా ఉంది.మా కుటుంబానికి ఆటోనే జీవనాధారం. సొంతింటిని కట్టుకోలేని పరిస్థితి. గూడు అనేది కలగానే ఉండేది. ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూం ఇల్లు దక్కడం సంతోషంగా ఉన్నది. ఇన్నాళ్లు గ్రామంలో మాతోపాటు మా అన్నదమ్ములందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం డబుల్ ఇంట్లోకి రావడం చెప్పలేని సంతోషాన్నిచ్చింది. మాకు ఇల్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ సార్కు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్కు కృతజ్ఞతలు.బండమీదిపల్లి లబ్ధిదారుల్లో ‘డబుల్’ ఆనందం నెలకొన్నది. గ్రామంలో రూ.1.25 కోట్లతో నిర్మించిన 24 డబుల్ బెడ్రూం ఇండ్లను శనివారం ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. దీంతో పేదల మోములో సంతోషం వెల్లివిరుస్తున్నది. కల సాకారమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గూడు లేని మాకు సొంతిళ్లు ఇచ్చారంటూ సీఎం కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు..రోజు గడవడానికే కష్టంగా ఉన్న దుస్థితిలో ఇల్లు కట్టుకోవడమంటే తలకుమించిన భారం. అందులోనూ ‘డబుల్’ ఇల్లు అంటే వారి ఊహకు కూడా అందని ఆలోచన. తెలంగాణ సర్కారు వారికలలను నిజం చేసింది. సొంతింటిని కట్టుకోలేక మనోవేదన చెందుతున్న తరుణంలో డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని జీవితంలో మరవమని లబ్ధిదారులు ఆనందంలో ఉప్పొంగిపోతున్నారు.
కల సాకారమైంది..
గ్రామంలో చిన్నపాటి కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. అద్దె ఇంట్లోనే ఉంటున్న నేను సొంతింటి కోసం ఎన్నో ఏండ్లుగా కలలు కన్నాం. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా కట్టుకోలేకపోయా. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్,ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చలువతో మాకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది.
– రాజేశ్వరీ, లబ్ధిదారురాలు
కేసీఆర్ సార్ కట్టించిండు..
గ్రామంలోనే కూలీ పనిచేసి జీవనం కొనసాగిస్తున్నాను. భర్త లేడు. ఒక్కడే కొడుకు చదువుకుంటున్నాడు. మా అమ్మా,నాన్న కూడా ఇంత మంచి ఇల్లు కట్టిస్తుండ్రో లేదో కానీ..సీఎం కేసీఆర్ సార్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్ కట్టించిండ్రు. వాళ్లను ఎన్నటికీ మరవను. ఇల్లు రావడం ఎంతో సంతోషంగా ఉంది.
– లక్ష్మమ్మ, లబ్ధిదారురాలు
చాలా సంతోషంగా ఉంది
ఇంట్లో,నేను అమ్మ ఇద్దరమే ఉంటాం. మా అమ్మకు చాతకాదూ..ఇంటి వద్దే ఉంటుంది. మమ్మల్ని చూసుకునేవారెవరూ లేరు. నేను ఊర్లో చేను పనికెళ్తుంటాను. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్ మాకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి, మా బతుకుల్లో వెలుగులు నింపారు. ఇల్లు వచ్చింది..మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. – అనసూయమ్మ, లబ్ధిదారురాలు