గద్వాల, డిసెంబర్ 3 : “నా పై నమ్మకం ఉంచి గద్వాల నియోజకవర్గ ప్రజలు రెండోసారి ఎమ్మెల్యేగా ఆదరించారు. ఇది ప్రజా విజయం” అని గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలే తన గెలుపునకు నాంది పలికాయన్నారు. కష్టకాలంలోనూ కేసీఆర్ వెన్నంటి ఉంటానని చెప్పారు. నడిగడ్డ కర్ణాటక సరిహద్దులో ఉండడం వల్ల అక్కడి కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసిన ప్రజలు ఇక్కడ కాంగ్రెస్‌ను ఆదరించలేదని చెప్పారు.
కర్ణాటక రైతులే స్వయంగా ఇక్కడికి వచ్చి వారి కష్టాలను తెలియజేయడం వల్ల నడిగడ్డ ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మలేదన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటి చేసిన అభ్యర్థి స్థానికేతరులు కాబట్టి ఇక్కడి ఓటర్లు ఆమెకు ఓటుతో సమాధానం చెప్పారన్నారు. తనను గెలిపించినందుకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. గద్వాల అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని చెప్పారు. ఈ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సరిచేసుకుంటూ ముందుకు సాగుతానని, గద్వాల ప్రజల ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ తనపై ఇలాగే ఉండాలని కృష్ణమోహన్‌రెడ్డి కోరారు.