నాగర్‌కర్నూల్, మే 1: అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ను కాదని, ఉన్న పథకాలను ఊడగొడుతున్న కాంగ్రెస్‌ను ఎన్నుకోవడంతో పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును ఇంటి ముందు కట్టేసుకున్నట్లుగా ప్రజల పరిస్థితి మారిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మర్రి బుధవారం మండలంలోని అనంతసాగర్, గడ్డంపల్లి, కార్వంగ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ పార్లమెంట్లో మన తరపున అన్ని సమస్యలపై నిలదీసేవాడు మన ప్రవీణ్‌కుమార్ సార్ అని, అందుకే కారుకు ఓటువేసి సారుకు మద్దతు ఇద్దామని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరంతా మోసపోయారని, ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు. రూ.2లక్షల రుణమాఫీ అని రైతులను, రూ.4 వేల ఫించన్ అని తల్లులను నట్టేటా ముంచారన్నారు. ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగ యువతను ఆగం చేశారని, వారి మోసకారి గ్యారెంటీలను నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.