అవసరం లేని చోట రిజర్వాయర్ నిర్మిస్తే రైతులకు నష్టం.. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది… ప్రజాధనం వృథా అవుతుంది.. ఈ విషయాలన్నీ తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వనపర్తి జిల్లాలో సాగునీటి ఇబ్బందులు ఉండేవి.. కానీ ఏదుల రిజర్వాయర్ నిర్మాణంతో నీళ్లు పుష్కలంగా పారుతున్నాయి. అయినా ప్రభుత్వం ఏదుల రిజర్వాయర్‌కు కూత వేటు దూరంలోనే మరో రిజర్వాయర్ ప్రతిపాదనను సిద్ధం చేసింది. దీంతో మూడు గ్రామాలకు చెందిన నిర్వాసితులు అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో గొల్లపల్లి చౌరస్తాలో వందరోజులకుపైగా దీక్షలు చేపట్టారు. అయినా కనీసం అధికారులు గానీ.. ప్రజాప్రతినిధులు గానీ.. అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
వనపర్తి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి-చీర్కపల్లి శివారులో రిజర్వాయర్ ప్రతిపాదనను పలు గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఏదుల రిజర్వాయర్ లేనప్పుడు ఈ ప్రాంతానికి సాగునీటికి ఇబ్బందులుండేవి. దీంతో ఎంజీకేఎల్ఐ డీ-8, డీ-5 కాల్వల ద్వారా సాగునీటి వసతులు సమకూర్చారు. ఏదుల రిజర్వాయర్ నుంచి ఈ ప్రాంతానికి సరిపడా సాగు నీరందించేందుకు సైతం ప్రత్యేకంగా తూమును ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో మరో కొత్త రిజర్వాయర్ నిర్మాణం చేసి సాగు నీళ్లివ్వాల్సన పరిస్థితులు ఇప్పుడు లేవు. దీన్ని గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ గొల్లపల్లి చౌరస్తాలో అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షలకు పూనుకున్నారు.
102 రోజులుగా నిరసన దీక్షలు
గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన వద్దంటూ అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన దీక్షలు 102 రోజుకు చేరాయి. గత డిసెంబర్ 30వ తేదీన ఆరు గ్రామాల రైతులు దీక్షలకు పూనుకున్నారు. నిత్యం 20 నుంచి 30 మంది రైతులు దీక్షల్లో పాల్గొంటున్నారు. మా సర్వస్వాన్ని కోల్పోయే రిజర్వాయర్ వద్దే వద్దంటూ భీష్మించుకూర్చుంటున్నారు. కొత్త రిజర్వాయర్ ప్రతిపాదనతో చెన్నారం, గొల్లపల్లి, చీర్కపల్లి, తల్పునూరు, రేవల్లి, ఏదుల గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. అధికంగా గొల్లపల్లి, చీర్కపల్లి రైతుల భూములు ముంపునకు గురవుతాయని అంచనా.
1,352 ఎకరాలు పోతాయని..
గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ ద్వారా 1,352 ఎకరాల భూమి రిజర్వాయర్‌లో మునకకు గురవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 15 రిజర్వాయర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 34ను రూపొందించింది. ఇటీవలి అసెంబ్లీలోనూ ఎమ్మెల్యే మేఘారెడ్డి గొల్లపల్లి రిజర్వాయర్ ప్రస్తావన తేవడంతో రైతులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో తమ భూములు పోయాయని, ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంతానికి ఏమాత్రం అవసరం లేని మరో రిజర్వాయర్‌ను ఏర్పాటు చేస్తామంటే ఒప్పుకునేది లేదని రైతులు తేల్చిచెప్పారు.
ప్రాణాలైనా వదులుతాం..
‘మా ప్రాణాలైనా వదులుతాం.. మా భూములను మాత్రం వదులుకోం’.. అంటూ రైతులు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే మూడు నెలలు గడచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయినా రైతులు మాత్రం దీక్షల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎన్నిరోజులైనా సరే శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని చెబుతున్నారు. కొత్త రిజర్వాయర్ ఏర్పాటుపై ఎమ్మెల్యే పునరాలోచించాలని, తమ జీవితాలతో ఆడుకోవద్దని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు చేస్తున్న దీక్షలకు పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతునిస్తుండటంతో రైతులు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు.
కూతవేటు దూరంలోనే ఏదుల
నూతనంగా ప్రతిపాదించిన గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ ప్రాంతం ఏదుల రిజర్వాయర్‌కు కూతవేటు దూరంలో ఉన్నది. ఏదుల రిజర్వాయర్ లేనప్పుడు కేఎల్ఐ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన గతంలో ఉండింది. కాగా, ఏదుల రిజర్వాయర్ నిర్మాణం జరిగిన అనంతరం ఇక గొల్లపల్లి రిజర్వాయర్ ఏర్పాటును ఉపసంహరించుకున్నారు. గొల్లపల్లి-చీర్కపల్లి ప్రాంతాలకు 45 వేల ఎకరాలకు సాగునీరు పారించేందుకు ప్రత్యేకంగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఏదుల రిజర్వాయర్‌లో తూమును ఏర్పాటు చేయించారు. దీంతో రిజర్వాయర్ నిర్మాణ ఆలోచనకు పూర్తిగా బ్రేక్ పడింది. అందునా వందలాది ఎకరాలు నీట మునిగే అవకాశం ఉండటం, పక్కనే ఏదుల రిజర్వాయర్ 7 టీఎంసీలతో ఏర్పాటు చేయడంతో కొత్త రిజర్వాయర్‌ను వద్దని నాటి పాలక వర్గాలు, ఆ ప్రాంత రైతులు నిర్ణయించారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవసరం లేని గొల్లపల్లి రిజర్వాయర్‌ను తెరపైకి తెచ్చి కేవలం కాంట్రాక్టుల కోసమే కొత్త డ్రామాకు తెరలేపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేడు దీక్షాస్థలికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు
గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ వద్దంటూ నిరసన దీక్షలు చేపట్టిన రైతుల శిబిరాన్ని గురువారం మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, నిరంజన్‌రెడ్డి సందర్శించనున్నారు. రైతులు వందరోజులుగా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నా ఒక్క అధికారి కూడా ఇటువైపు చూడకపోవడంపై రైతులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మాజీ మంత్రులు దీక్ష చేస్తున్న రైతులను కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. దీక్ష చేస్తున్న గ్రామాల రైతులతో పాటు అక్కడికి తరలివచ్చే అన్నదాతలతో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేలా బీఆర్ఎస్ ఏర్పాట్లను చేపట్టింది.
నేడు హరీశ్‌రావు రాక
గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రజాభిప్రాయం తెలుసుకొనేందుకు బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు రానున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గొల్లపల్లి-చీర్కపల్లి రైతులు వంద రోజులుగా రిజర్వాయర్ వద్దంటూ నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ఈ నేపథ్యంలో రైతుల మనోభావాలు తెలుసుకుని వారికి భరోసా కల్పించి దీక్షలను విరమింపజేయాలన్న లక్ష్యంతోనే గురు వారం సాయంత్రం 4 గంటలకు హరీశ్‌రావు పర్యటించనున్నట్లు చెప్పారు.
మాకు బతుకు లేదు
ఏదుల రిజర్వాయర్‌లోనే మాకున్న 8 ఎకరాలు పోయింది. మళ్లీ మేం 16ఎకరాలు భూమిని నలుగురం అన్నదమ్ములం కలిసి కొన్నాం. ఇప్పుడు మళ్లీ కొత్తగా గొల్లపల్లి రిజర్వాయర్ అంటున్నరు. ఇది కడితే మేం కొన్న భూమి మొత్తం నీటిలో మునుగుతుంది. మాకున్న గొర్లను అమ్మి…మా రెక్కల కష్టంతో కూడబెట్టిన సొమ్ముతో కొన్న పొలం. ఇది లేకుంటే మాకు బతుకు లేదు. ఈ భూములను వదలం. మా పొలాలకు కాల్వ నీళ్ల్లు పారుతున్నాయి. ఎవరి కోసం కొత్త రిజర్వాయర్ కట్టాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు.
– లింగం, గాంధీనగర్, చీర్కపల్లి, ఏదుల మండలం
సర్వస్వం పోతుంది
మాకు 11 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. మేం ఐదుగురం అన్నదమ్ములం. ఒక బోరు, బావి ఉంది. మా పొలం మధ్యలోనుంచే డీ-5 కాల్వ పోయింది. దీంతో సాగునీరు పుష్కలంగా అంద డంతో పంటలు పండిస్తున్నం. కొత్తగా కట్టాలనుకుంటున్న రిజర్వాయర్‌లో మా 11 ఎకరాలు మునుగుతుంది. మా భూములు పోయిన తర్వాత మేం ఏం చేయాలి.. ఎలా బతకాలి. ఒక ఇల్లు మాత్రమే మిగులుతుంది. మా సర్వస్వం పోతది. అందుకే వద్దని ఇన్నాళ్లుగా దీక్షలు చేస్తున్నం. సర్కారు అర్థం చేసుకోవాలి.
– రాములు, రైతు, చీర్కపల్లి, ఏదుల మండలం
డబ్బులకు ఆశపడం
భూములు పోగొట్టుకుని డబ్బులకు ఆశపడేవాళ్లం కాదు. పొద్దస్తమానం భూమిలో పొర్లాడేటోళ్లం. డబ్బుల ఆశ చూపి ఏదో చేయాలనుకుంటే కుదరదు. మాకు 10ఎకరాల పొలంలో 3ఎకరాల మామిడి, మరో 3 ఎకరాల్లో వరి పండిస్తున్నాం. నీటికి ఇబ్బంది లేదు. కేఎల్ఐ నుంచి సాగునీరు పుష్కలంగా అందుతున్నది. పదేండ్ల కింద నీళ్ల ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఆపరిస్థితి లేదు. పక్కనే రిజర్వాయర్ ఉంది. మళ్లీ మా భూములు ముంచుతాం అంటే ఒప్పుకోం. సర్కారు ఆలోచన సరైంది కాదు. మా భూములను మాత్రం వదులుకోం. ఎంతకైనా సరే తెగిస్తాం.
– మహేశ్ రావు, రైతు, చీర్కపల్లి, ఏదుల మండలం