హన్వాడ ఏప్రిల్ 26 : కుల వివక్ష నిర్మూలన కోసం ఎన్ని చట్టాలు వచ్చినా నేటికి చాలా గ్రామాల్లో కుల వివక్షత కొనసాగుతూనే ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. హన్వాడ మండల కేంద్రంలో ఆదివారం మహనీయుల జాతర నిర్వహించారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, అంబేద్కర్ వల్లనే దేశంలో రిజర్వేషన్లు, ఓటు హక్కు కల్పించారని గుర్తుచేశారు.
చిన్న రాష్ర్టాల వల్లనే అభివృద్ధి చెందుతాయని రాజ్యాంగంలో ఉండడంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు. మహానీయుల ఆశయాలను ప్రతిఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశీం, న్యాయవాది బెక్కం జనార్దన్, జాతర కమిటీ నాయకులు కిరణ్, జంబులయ్య, శ్రీను, కేశవులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నా యకులు, దళిత ప్రజా సంఘాల నాయకులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.