మహబూబ్‌నగర్ అర్బన్, మే 9 : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వెంటనే పూర్తిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలమూరు రైతులను అదుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకొచ్చారన్నారు. ప్రాజెక్టు పనులు బీఆర్ఎస్ హయాంలో 90శాతం పూర్తిచేశామని, 10శాతం పనులు మిగిలి ఉండగానే ప్రభుత్వం మారడంతో పూర్తి చేయలేకపోయామన్నారు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రాజెక్టు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన మండిపడ్డారు. పనులు త్వరగా పూర్తిచేసి ఉమ్మడి జిల్లాలోని చెరువులను నింపి వచ్చే సీజన్ నాటికి రైతుల పొలాలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయకుంటే చూస్త్తూ ఊరుకోబోమని రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టుపై త్వరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి తమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు.
అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ-2 యాదయ్య, మాజీ సర్పంచులు సురేశ్‌నాయక్, రాందాస్, మన్యనాయక్, శ్రీనివాసులు, నాయకులు మాసయ్య, దస్తయ్య, వెంకటేశ్ యాదవ్, షేక్ మహ్మద్, గోపాల్‌తోపాటు 200మంది కార్యకర్తలు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ చేరారు. వారికి మాజీ మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఏడాదిన్నర కావస్తున్నా రైతులకు సక్రమంగా రుణమాఫీ జరగలేదని, రైతు బంధు.. రైతు బీమా అందడంలేదని, కనీసం రైతులు పండించిన పంట కొనడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లోకి కాంగ్రెస్ నాయకులు వస్తే ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీయాలన్నారు.
కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోయామని ప్రజలు ఇప్పుడిప్పుడే చర్చించుకుంటున్నారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పేడితే భయపడొద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు. వచ్చే ఎన్నికలో బీఆర్ఎస్ ఆధికారంలోకి రావడం ఖాయం..కేసీఆర్ సీఎంగా ప్రజలకు మంచి పాలన అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఇతర పార్టీలో చేరిన నాయకులు తిరిగి పార్టీలోకి వస్తున్నారని..పార్టీ సీనియర్ లీడర్లు సమన్వయం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో హన్వాడ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ నరేందర్, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, సీనియర్ నాయకులు చెన్నయ్య, లక్ష్మయ్య, శ్రీనివాసులు, అనంత్‌రెడ్డి, అన్వార్ తదితరులు పాల్గొన్నారు.