హన్వాడ, మే 14 : రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి పక్షం రోజులు కావస్తున్నా కొనుగోలును ఎందుకు వేగవంతం చేయడంలేదని, అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం సబబు కాదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మండలకేంద్రంలో రైతు సేవా సహకర సంఘ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ముందుగా కొనుగోలు కేంద్రంలో ఉన్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులు పదిహేను రోజులుగా పడిగాపులు కాస్తున్న పట్టించుకోరా అని ప్రశ్నించారు.
కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత వల్ల ధాన్యం తూకం చేయకుండా నిల్వ ఉంచే పరిస్థితి ఏర్పడిందన్నారు. తూకం చేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల కొరతతో తరలించకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ క్పష్ణయ్యగౌడ్, మాజీ ఎంపీపీ బాలరాజ్ నాయకులు కొండ లక్ష్మయ్య, నాగన్న, కరుణాకర్‌గౌడ్, బసిరెడ్డి, చెన్నయ్య, శ్రీనివాసులు, నరేందర్, హరిచందర్ పాల్గొన్నారు.