మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 2: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి పునర్నిర్మాణంలో దేశంలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేసిన ఘనత కేసిఆర్‌కు దక్కిందని.. కానీ అధికారం చేపట్టిన కాంగ్రెస్ హయాంలో ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఉద్యమ నాయకుడు కేసీఆర్ అన్నివర్గాలను, పార్టీలను ఐక్యం చేసి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ ఆధ్వర్యంలో అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే ఎక్కువ వరిపంట పండించి పంజాబ్ రికార్డులు చెరిపి వేశామని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు, రైతు కూలీలకు వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతతో ఈ ఘనత దక్కిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దగాపడిన రైతాంగం తెలంగాణ వచ్చాక రికార్డుస్థాయిలో పంటలు పండించిందని గుర్తు చేశారు.
రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, పల్లెల్లో పట్టణాల్లో ప్రకృతి వనాలు ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మాయమాటలను నమ్మి ప్రజలు ఆ పార్టీకి ఓటేసి ఇప్పుడు పశ్చాత్తాప పడే రోజులు వచ్చాయని ఆవేదన చెందారు. రైతుల ధాన్యం కొంటలేరు.. పెట్టుబడి సహాయం లేదు.. ఉచిత విద్యుత్ పథకం కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన సాగుతుందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియాలో మా కార్యకర్త ఓ పోస్ట్ పెట్టినందుకు అతనిని కేసు పెట్టి జైలుకు పంపించారని.. దీనిని ప్రశ్నిస్తే నాపై కూడా కేసులు పెట్టారని గుర్తు చేశారు.
తెలంగాణ నీటిపారుదల శాఖలో సలహాదారుడిగా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన అధికారిని నియామకం చేశారు.. దీంతో పాలమూరు ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయని, దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణలో మళ్లీ పూర్వవైభవం రావాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని.. దానికోసం ప్రతి నాయకుడు.. కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, కేసీ నర్సింహులు, గంజి వెంకన్న, శ్రీకాంత్ గౌడ్, శివరాజ్, కట్టా రవికిషన్, దేవేందర్‌రెడ్డి, ఆంజనేయులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు పార్టీ పట్టణ నాయకులు పాల్గొన్నారు.