హన్వాడ, మే 10 : మాయమాటలు, సాధ్యంకానీ హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, నేడు హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం హన్వాడలో నిర్వహించిన రోడ్‌షోలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్‌అలీ మాట్లాడుతూ రాష్ర్టాన్ని సాధించిన తెలంగాణను పదేండ్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ కావాలా.. ఢిల్లీ రాజకీయాలు మనకు కావాలా? ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింకు ప్రాధాన్యం ఇచ్చిందని, రంజాన్‌కు కానుకగా దుస్తులు అందజేసిందని, ఆడబిడ్డల పెండ్లికి షాదీ ముబారక్‌తో రూ.లక్షా116 అందించి ఆదుకున్నదని గుర్తు చేశారు. అదేవిధంగా ఇమాం, మౌజంలకు గౌరవేతనాలు అందించిందని, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేసిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని ఆరోపించారు. మతతత్వ బీజేపీ, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలని, స్థానికుడైన మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
హస్తం పార్టీని నిలదీయాలి : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
70 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణను మోసం చేసింది కాంగ్రెస్సే అని, అలాంటి పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలల్లోనే కరువు వచ్చిందని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ కరువు పరిస్థితులు లేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు పాతరోజులు గుర్తు చేస్తున్నాయని రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, తాగునీరు, కరెంట్ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పదేండ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి ఏమీ చేయకుండా ఇప్పుడు దేవుడి పేరుతో ఓట్లు అడుగుతుందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్తోనే పేదలకు సంక్షేమం అందుతుందని ప్రజలు, కాంగ్రెస్, బీజేపీలను ఓడించి బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, ఎంపీపీ బాలరాజు, నాయకులు కొండ లక్ష్మయ్య, జంబులయ్య, శ్రీనివాసులు, నరేందర్, చెన్నయ్య, హరిచందర్, బసిరెడ్డి, శివకుమార్, ఆనంద్, ఖాజాగౌడ్, మోహన్, నాయ కులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
మరోసారి గెలిపించండి..; బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె
తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే అన్నం పెట్టే స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే దిక్సూచిలా మార్చిన బీఆర్ఎస్కు ప్రజలు ఎల్లవేళలా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని అలాంటి పార్టీ మనకు అవసరమా ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను చెప్పి గారడీ మాటలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హా మీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నది. ముఖ్యంగా రైతులు, ప్రజలను ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతున్నదని, అలాంటి పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థులెవరూ స్థానికులు కాదని, నేను పక్కా లోకల్ అని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తానని తనను మరోసారి ఆదరించి ఎంపీగా గెలిపించాలి.