మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 7 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నదని, దీనిని ఆసరా చేసుకొని మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో న్యూటౌన్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించగా మాజీ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లులో చట్టబద్ధత కల్పించి ఎన్నికలు నిర్వహించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మరోమారు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నదని ఆరోపించారు. గ్రామ, వార్డుల్లోకి వెళ్లి గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులతో బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందని ఆ పనులను నిలిపేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహబూబ్‌నగర్ అన్నిరంగాల్లో వెనుకబడుతుందని విమర్శించారు. గతంలో కట్టించిన ఇండ్లను ఇవ్వకుండా కాంగ్రెస్ అడ్డుకుంటూ పట్టాలు ఇచ్చినా వారి వద్దనుంచి గుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలకు వాస్తవం తెలిసి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మరోమారు మోసపోతామనే విషయాన్ని గుర్తిస్తున్నారని అన్నారు. పోలీస్ అధికారులు కూడా అతిగా వ్యవహరించకుండా చట్ట ప్రకారం పనిచేయాలని అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. నాయకులు, కార్యకర్తలు కేసులకు భయపడవద్దని లీగల్‌గా ముందుకెళ్తూ అందరినీ కంటి రెప్పలా కాపాడుకుంటామన్నారు. పార్టీలో ఉన్నవారికి మంచి భవిష్యత్‌లో మంచి ప్రయారిటీ ఉంటుందని అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎవరికి అవకాశం ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగరవే యాలన్నారు. రాష్ట్రంలో కూడా తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు పాలమూరును అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని వివరించారు. సమావేశంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెహమాన్, బెక్కం జనార్దన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, గణేశ్, అనంత్‌రెడ్డి, నవకాంత్, సాయిలు, రమేశ్‌నాయక్, ఇమ్రాన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, జూలై 7 : కాంగ్రెస్ ప్రభుత్వం వ చ్చాక అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది పాలమూరులో పోలీస్‌స్టేషన్ ఎదుట శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు మరికొందరు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు నిరసన తెలిపారు. అయితే విధులకు ఆటంకం కలిగించారని, అదే రోజు సాయంత్రం మహబూబ్‌నగర్ వన్‌టౌన్ సీఐ అప్పయ్య పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సోమవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కాకుండా టుటౌన్ పీఎస్‌లో సీఐ ఇజాజొద్దీన్, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రవిసాగర్, పల్లెరవి, ఆంజనేయగౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు జంబులయ్య స్టేషన్‌కు వెళ్లారు. అనంతరం బయటకు వచ్చిన శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు.
గత సంవత్సరం నవంబర్ నెలలో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వారియర్ వర్ధ భాస్కర్ ముదిరాజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టాడని ఎవరూ ఫిర్యాదు చే యకపోయినా అతడిని వన్‌టౌన్ పీఎస్‌కు తీసుకెళ్లారని తెలిపారు. అక్కడ సీఐ అప్పయ్య ఎందుకు పోస్టు పెట్టావని ? విచారణ పేరుతో దారుణంగా చితకబాదారని, ఈ విషయం మాకు తెలిసి మా కార్యకర్తపై ఎందుకు కొట్టారని అడగడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిరసన తెలిపినా ఏం లేదని చెప్పి పంపించి అక్రమ ంగా తనతోపాటు చాలా మందిపై కేసులు నమోదు చేశారు. ఆ కేసులో పోలీస్‌స్టేషన్‌లో విధులకు ఆటం కం కలిగించకున్నా అక్రమంగా కేసులు నమోదు చేశారన్నారు. వన్‌టౌన్ సీఐ ఆగడాలు మితిమీరిపోయాయన్నారు. ఆదివారం ఓ చాయ్ దుకాణం వద్ద దురుసుగా ప్రవర్తించి అద్దాలను, మీటర్ వైర్లను ధ్వంసం చేశారన్నారు. కేసులు నమోదు చేయాలి కానీ.. ఇలా దుకాణాలపై దాడులు చేయడం.. భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.