వనపర్తి టౌన్, సెప్టెంబర్ 22 : ప్రజా సంక్షేమ కోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు స్థానికంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. కార్యధ్యక్షత, అనుభవం లేని ప్రభుత్వం నేడు పరిపాలనలో ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని, 60 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే 40 లక్షల మంది మాత్రమే రైతులు రుణాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించి రైతు రుణమాఫీకి క్యాబినెట్లో రూ.27వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి కేవలం రూ.17వేల కోట్లు మాత్రమే మంజూరు చేసిందని దుయ్యబట్టారు. రైతుబంధును పంట కాలం ముగుస్తున్నా నేటికీ ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచారన్నారు. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం, కేసీఆర్ కిట్టు, అమ్మఒడి, మహిళలకు రూ.2500, నిరుద్యోగ భృతి వంటి హామీలకు మంగళం పాడిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు.
ఆశ్రిత పక్షపాతం పాటిస్తూ అనుయాయులకు పెద్దపీట వేస్తున్నారని, 9 నెలల కాలంలో ఒక్క కొత్త జీవో ఇవ్వకుండా ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించి మన హయాంలో జరిగిన అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగిసిందని ప్రజల సమస్యలపై ఎక్కడిక్కడ నిలదీయాలన్నారు. నాయకులు వ్యక్తిగత విమర్శలకు తావు ఇవ్వకుండా విధానాలపై మాట్లాడి ప్రజల మన్ననలు పొందాలని హితవు పలికారు. ప్రజల సమస్యలపై పోరాడే నాయకులే ప్రజాధరణ పొందుతారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు బీ లక్ష్మయ్య, సర్దార్‌ఖాన్, అశోక్, గంధం పరంజ్యోతి, కృష్ణనాయక్, పృథ్వీరాజ్, సంధ్యా తిరుపతయ్య, రఘుపతిరెడ్డి, పద్మా వెంకటేశ్, విజయ్‌కుమార్, సింగిల్‌విండో అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, జగన్నాథంనాయుడు, పెబ్బే రు మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ, వైస్‌చైర్మన్ కర్రె స్వామి, సాయికుమార్, రాములు, వెంకటస్వామి, వేణు, రాళ్ల కృష్ణయ్య, రఘురామరావు, బాలరాజు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.