వనపర్తి, మే 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలన సర్కస్‌ను తలపిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో దుష్ప్రచారం చేసినందువల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి అంకితమై సభ్యత్వ నమోదును పకడ్బందీగా చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిరంజన్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు మెట్టు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సింగిరెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేపట్టిన దుష్ప్రచారంతోనే ప్రజలు మోసపోయారని, తద్వారా బీఆర్ఎస్ ఓటమి చెందిదని తెలిపారు. తెలంగాణపై ఏమాత్రం సోయిలేని వాళ్లు పాలించడం దురదృష్టకరమని, మళ్లీ రెండున్నరేళ్లుగా తెలంగాణ అభివృద్ధిలో వెనక్కి వెళ్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ హామీల అమలు కోసం గల్లా పట్టి నాయకులను నిలదీయాలని, వీటిపై ప్రజలను మరింత చైతన్యం చేయాలని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
నియోజకవర్గంలో 70వేలకు పైగా గతంలో సభ్యత్వ నమోదు చేసి ముందంజలో నిలిచామన్నారు. నూతన సభ్యత్వ నమోదులో ఇచ్చిన బాధ్యతలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని, పార్టీపై విధేయత, చిత్తశుద్ధి ఉన్న నాయకులు, కార్యకర్తలకు పార్టీ పదవుల్లో సముచిత స్థానం ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకులు, నిత్యం ప్రజల్లో ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందని, గతంలో పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వారికి సభ్యత్వం కూడా ఇవ్వరని తెలిపారు. అంకితభావంతో ఉన్న వారికే పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సభ్యత్వ నమోదుతో బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలోనూ పటిష్టంగా ఉండాలన్నారు.

ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి : మెట్టు
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ‘ఎస్ఐఆర్’పై నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ పేర్కొన్నారు. జూన్ 25 నుంచి జులై 25వ తేదీ వరకు సర్ కార్యక్రమం కొనసాగుతుందని, ఇందులో బూతు కమిటీ సభ్యులు అ ర్హత ఉన్న ఓట్లను తొలగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓట్ల తొలగింపులు, చేర్పులు, మార్పు లు 18ఏండ్ల్లు నిండిన యువత ఓట్లపై తగిన రీతిలో వ్యవహరించాలన్నారు. ఓటరు లిస్టులో పేరుందో..లేదో స్పష్టం తనిఖీ చేయాలని, దీనిపై ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదన్నారు.
2021లో పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టిందని, ప్రస్తుత సభ్యత్వ నమోదు ద్వారా రేవంత్ పోవాలి..కేసీఆర్ రావాలి అన్న లక్ష్యంతో ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. పార్టీపై విధేయత నాయకుడిపై విశ్వాసం ఉన్న కార్యకర్తలు, నాయకులకు పార్టీ ప్రాధాన్యతనిస్తుందన్నా రు. రాష్ర్టాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్రభాగాన కేసీఆర్ నిలబెట్టారని, కాంగ్రెస్ హామీలన్ని గాలిలో దీపాలయ్యాయని, బీఆర్ఎస్ చేపట్టిన పథకాలన్ని కాంగ్రెస్ నిలిపివేసిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గట్టు యాదవ్, శ్రీధర్, రమేశ్ గౌడ్, అశోక్, జగదీశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, కృష్ణానాయక్, మాణిక్యం, కృష్ణయ్య, కరుణశ్రీ, హేమం త్, గిరి, రాము, హుస్సేన్, పరంజ్యోతి పాల్గొన్నారు.