వనపర్తి, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): ప్రజల గుండెల్లో బీఆర్ఎస్కు చెరగని ముద్ర ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి నెంబర్ వన్‌గా నిలిబెట్టిన ఘనత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా మాజీ మంత్రి శనివారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ అనంతరం రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిందన్నారు.
ఉద్యమ పోరాటంతో రాష్ర్టాన్ని సాధించి, ప్రజల మద్దతుతో పరిపాలన సాగించి అభివృద్ధి.. సంక్షేమాన్ని సమపాళ్లుగా ముందుకు తీసుకెళ్లిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపిన బీఆర్ఎస్కు ప్రజల్లో ఎప్పటికీ తిరుగులేదన్నారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఇంతలా ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభు త్వం గతంలో ఎప్పుడూ లేదన్నారు. కాంగ్రెస్ పాలన తిరోగమన వైఖరితో కొనసాగుతుందని, అసమర్ధనీయంగాను, ఈర్షాద్వేషాలతో కాలయా పనసాగిస్తున్నదన్నారు.
పాలనాపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అందువల్లే ఇంతటి ప్రజావ్యతిరేకత పెల్లుబికుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా.. కాంగ్రెస్ నాయకులన్నా ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంటుందని, ప్రజల మనసునిండా అసంపూర్తి రగులుతుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌పై ఎప్పుడు కక్ష తీర్చుకోవాలన్న పట్టుదలతో ప్రజలు ఎదురుచూస్తున్నారని, ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ ఏమాత్రం గుర్తించడం లేదన్నారు.
ఈ క్రమంలో మళ్లీ రాష్ట్రంలో కేసీఆర్ రావాలని, బీఆర్ఎస్తోనే రాష్ట్ర ప్రజలకు సమస్యలు తొలగుతాయన్న విశ్వాసంతో ఉన్నారన్నారు. 25ఏండ్ల బీఆర్ఎస్ ప్రస్థానంలో అనేకమంది త్యాగాలు చేసి అజేయులుగా నిలిచారని, మరికొందరు ద్రోహం చేసి చరిత్రలో కలిసిపోయారన్నారు. ప్రతి జిల్లా, నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్సభకు భారీగా తరలి వెళ్తున్నారని చెప్పారు. ఈ విజయోత్సవ సభ నూతన శకానికి నాందిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.