వనపర్తి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, ప్రభుత్వ వైఫల్యం ద్వారానే వరదల్లో ప్రాణనష్టం సంభవించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం వనపర్తిలో సింగిరెడ్డి నివాసంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్ర తినిధి వాకిటి శ్రీధర్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద విపత్తులకు ముందే అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిందన్నారు.
ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉండి కూడా ప్రజానీకం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించే పరిస్థితులు రావడం బాధాకరమన్నారు. ప్రజల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని, ఒక సైంటిస్టును, ఆమె తండ్రిని వరదల్లో కోల్పోవడం ద్వారా ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందో అర్థమవుతున్నదన్నారు. సీఎం వరదలను చూసేందుకు వస్తుంటే పూల అలంకరణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఖమ్మంలో ముగ్గురు మంత్రుల తీరుపై ప్రజాగ్రహం కట్టలు తెం చుకున్నదని, వారి అవసరాలకు హెలిక్యాప్టర్లు ఉంటాయి కానీ, పేదల ప్రాణాలు కళ్లేదుట పోతుంటే హెలిక్యాప్టర్లు లేవని చెప్పడం దారుణమన్నారు. గతంలో కూడా వరదలు వచ్చాయని, అప్పట్లో బీఆర్ఎస్ ఉదారంగా వ్యవహరించిన తీరును గుర్తుచేశా రు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపై నిందలు వేయకుండా పనిచేసి చూయించామన్నారు.
పదేండ్లలో ఎనలేని అభివృద్ధి చేసినా గోరంతను కొండంతను చేసి చూపించిన మీడియా నేడు ప్రభుత్వ తప్పిదాలపై ఎందుకు మౌనం దాల్చుతున్నదని ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టు ద్వారా రెండు నెలలుగా నీటిని కిందకి వదులుతుంటే, ఇక్కడి చెరువులను నింపాలన్న కనీస ఆలోచన కూడా పాలకులకు లేకపోవడం విచారకరమన్నారు. వరుణుడి కటాక్షంతో జిల్లాలో చెరువులకు నీళ్లు వచ్చాయని చెప్పారు. లేదంటే రానున్న కాలంలో ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉండేవన్నారు.
రూ.25లక్షల పరిహారమివ్వాలి..
ప్రతిపక్షంలో ఉండి, కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో బాధితుల కోసం రేవంత్‌రెడ్డి గతంలో రూ.25లక్షల పరిహారాన్ని డిమాండ్ చేశారని సింగిరెడ్డి గుర్తు చేశారు. నేడు సీఎంగా రేవంత్‌రెడ్డి ఉన్నారని, వరదలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం రూ.5లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాద ని, డిమాండ్ చేసింది కూడా ఇవ్వకలేకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
పాలమూరుకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఈ ప్రభుత్వంలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదన్నారు. వీరి నిర్లక్ష్యం పుణ్యమా అంటూ 12 లక్షల ఎకరాలకు నీరు అందివ్వాల్సిన ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతున్నదన్నారు. మంత్రులు సైతం ప్రాజెక్టును ఒక్క రోజు కూడా సందర్శించిన దాఖలాలు లేవని, ఇలా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలన్నీ బోగస్‌గా తేలిపోయాయన్నారు.
రాష్ట్రంలో వరదల మూలంగా జరిగిన పంట నష్టం, ఇసుక మేటలు వేసిన వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని, అలాగే పంట నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో నా యకులు లక్ష్మయ్య, రమేశ్‌గౌడ్, మాణిక్యం, అశోక్, గులాం ఖాదర్, రఘునాథ్‌రెడ్డి, పరంజ్యోతి, మహేశ్వర్‌రెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గంగమ్మ తల్లికి పూజలు..
పెద్దమందడి, సెప్టెంబర్ 3 : మండలంలోని వెల్టూరు గోపాల సముద్రం చెరువు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి అలుగు పారింది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెరువు వద్దకు వెళ్లి గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పూలు సమర్పిం చి పూజలు చేశారు. అదేవిధంగా కట్టపై ఉన్న కట్టమశమ్మ, వేణుగోపాలస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు నేతలు రఘుపతిరెడ్డి, వేణుయాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్, అశోక్, కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, యాదయ్య, రఘువర్దన్‌రెడ్డి, సురేశ్, ఆంజనేయులు, శ్రీధర్, గణేశ్, వెంకటయ్య తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
వనపర్తి టౌన్, సెప్టెంబర్ 3 : జిల్లా కేంద్రంలోని విమోచన దవాఖాన ఎండీ డాక్టర్ రాఘవులు సతీమణి మరియమ్మ ఇటీవల ఆనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అ శోక్, తిరుమల్, గులాం ఖాదర్‌ఖాన్, స్టార్ రహీం, పరంజ్యోతి, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, తోట శ్రీను తదితరులు ఉన్నారు.