వనపర్తి, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): అనుక్షణం ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావును అక్రమంగా ఆరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన హరీశ్‌రావును సింగిరెడ్డి గురువారం పరామర్శించి సంఘీభావం తెలిపారు. అరెస్ట్‌పై నిరంజన్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఫిర్యాదును తీసుకోనందుకు బాధ్యతగల ఎమ్మెల్యేగా హరీశ్‌రావు పోలీసు అధికారులను ప్రశ్నిస్తే అతడిని అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఓ ఎమ్మెల్యే కోసం వెళ్లిన హరీశ్‌రావును నిర్లక్ష్యంగా నెట్టుకుంటూ దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం సరైందికాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన వాగ్ధ్దానాలు అమలు చేయలేక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అసహనానికి గురై ప్రజల తరఫున నిలబడి ప్రశ్నిస్తున్న హరీశ్‌రావు, కేటీఆర్‌ను ఎలాగైనా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలని ప్రయత్నిస్తున్న ప్రభు త్వ బాధ్యుల చర్యలను తిప్పికొడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన, తిరోగమన పాలన కొనసాగుతున్నదని, సంక్షేమ పథకాలకు కోత విధించి, కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలను రద్దు చేస్తూ రోజుకో అనాలోచిత ప్రకటనలను ప్రభు త్వం చేస్తున్నదని దుయ్యబట్టారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేసి కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.