వనపర్తి టౌన్, జూలై 28 : సాహిత్యం సమాజహితాన్ని, సామాజిక ప్రయోజనాన్ని కోరుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో కవి, రచయిత నాగవరం బాల్‌రాం రచించిన రిఫ్లెక్షన్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సాహిత్యం ఒక దేశ సంస్కృతిని ప్రతిబింబింపజేయడమేగాక మానసిక వికాసం, పరిణితిని కలిగిస్తుందని గుర్తు చేశారు. నాగవరం బాల్‌రాం 50 ఏండ్లు తమ సాహిత్య జీవితంలో మనిషికి, సమాజానికి సంబంధించిన అనేక అంశాలను వివిధ కోణాల్లో విశ్లేషించి కవితలు రాశారన్నారు. సమాజంలో వివాదాలు, వివక్షలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా మనిషి ఎదగాలనేది తన ఆకాంక్ష అని అన్నారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో, సాహిత్య జీవితంలో నాగవరం బాల్‌రాం అజాత శత్రువుగా ముందుకు సాగుతున్నారని కొనియాడారు.
రిఫ్లెక్షన్స్ కవితలు నేటి తరం చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, అందుకు ఆ పుస్తకాలు జిల్లాలోని ప్రతి పాఠశాలకు అందజేసేలా తాను ఆర్థిక సాయం చేస్తానని పేర్కొన్నారు. అనంతరం మాజీ మంత్రి, మాజీ ఎంపీ, నిర్వాహకులు కవి, రచయిత బాల్రాంను పూలమాల, శాలువా కప్పి జ్ఞాపికతో సన్మానించారు. కార్యక్రమంలో సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య, ప్రముఖ వైద్యులు భూపేశ్కుమార్, సత్తార్, చిన్న రాములు, కౌన్సిలర్లు వాకిటి శ్రీధర్, నాగన్న, గులాం ఖాదర్, సాహితీవేత్తలు కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, వనపట్ల సుబ్బయ్య, డాక్టర్ వీరయ్య, బైరోజు చంద్రశేఖర్, నారాయణరెడ్డి, బండారు శ్రీనివాసులు, వాహీద్‌ఖాన్, మద్దిలేటి, శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు.