నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 8 : ఉమ్మడి పాలమూరు జిల్లా లో నీటి వనరు అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించుకుపోతుంటే ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పాలకులకు పట్టింపు లేకుండా పోయిందని, ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తూ నల్లగొండకు నీటి తరలింపును ఏ ఒక్క నాయకుడు అడ్డుకోలేక పోతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమంగా నీటి తరలింపుపై మండిపడ్డారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులు సైతం రైతులు, ప్రజలకోసం కాకుండా స్వప్రయోజనాలకోసం పాలన సాగిస్తున్నట్లుగా ఉందన్నారు. పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత ఉమ్మడి జిల్లా రైతులకు అన్యాయం చేసేలా నీటి తరలింపు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఏదుల నుంచి నల్లగొండకు నీటి తరలింపుతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్ర జలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని మూకుమ్మడిగా పాలకులు నీటి తరలింపును అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం సమస్య తెలియడం లేదని, మున్ముందు మరింత తీవ్రంగా నష్టపోతామని, నల్లగొండకు నీటి తరలింపు జరిగితే సా గు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని 12 లక్షల 30 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు జీవో ఇచ్చినా కేవ లం 7 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని అందించేందు కు చూస్తున్నారన్నారు. అందులోనూ మరింతకోత పెట్టేందుకు నల్లగొండకు ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు పూనుకోవడం ఇక్కడి పాలకుల నిర్లక్ష్యమన్నా రు.
నీటి తరలింపును ఆపేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కొట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులపై అవగాహన లేకపోతే తెలుసుకోవాలని, మన అవగాహన లేమితో నీటి తరలింపును అడ్డుకోలేకపోతే సమస్యలు తీవ్రమవుతాయన్నారు. ఒకప్పుడు నీటి తరలింపు వద్దని సంతకాలు పెట్టిన నాయకులు ఇప్పుడు నోరు మెదపడం లేదని, అచేతనులయ్యారా అని ప్రశ్నించారు.
ప్రాజెక్టుల గురించి అర్థం కాకపోతే తాను ఎక్కడకు రమ్మంటే అక్కడికి వచ్చి నీటి తరలింపుతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు జరిగే అన్యాయాన్ని వివరిస్తారని, పాలకులకు అర్థమయ్యే లా చెబుతానని నాగం పేర్కొన్నారు. ప్రభుత్వానికే ప్రాజెక్టులపై అవగాహన లేదని, నల్లగొండకు చెందిన ఓ రిటైర్డ్ ఇంజినీర్ చెప్పినట్లుగా చేస్తూ మన ప్రాంతంపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు. ప్రజలు, రైతులు మనల్ని నమ్మి గెలిపించుకున్నందుకు వారి బాగుకోసం, అభివృద్ధి కోసం శాశ్వతంగా గుర్తుండే పనులు చేసినపుడే నిజమైన పాలకుడవుతాడన్నారు.
పదవులు వచ్చిపోయేవేనని, ఉన్న పదవి కాలంలో ఏం పనులు చేస్తున్నామన్నది ప్రజ లు గుర్తుంచుకుంటారన్నారు. నీటి తరలింపు విషయంలో ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజ ల్లో అవగాహన కల్పించి నీటి తరలింపును అడ్డుకునేందు కు ఉద్యమిస్తామన్నారు. ప్రాజెక్టులోని మొదటి నుంచి నీటిని తరలించుకుపోతే వట్టెం, కర్వెన, ఉదండాపూర్ ప్రాజెక్టుల పరిధిలోని రైతులు, ప్రజలకు నీటి కష్టాలు తప్పవన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అర్థం రవి, బాలగౌడ్, లక్ష్మయ్య, అర్జునయ్య పాల్గొన్నారు.