మహబూబ్నగర్, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటున్న 22మంది విదేశీ అతిథులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని పిల్లలమర్రి పర్యటనకు వస్తుండడంతో జిల్లా అధికార యంత్రాగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం సాయంత్రం 5గంటలకు పాలమూరుకు విదేశీ అతిథులు చేరుకుంటారు. పాలమూరు సాంప్రదాయం ఉట్టిపడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కో లాటాలు, డోలు, బతుకమ్మ సాంప్రదాయ కళాకారులతో ప్రదర్శనలకు సిద్ధం చేశారు. దాదాపు 2గంటలపాటు పిల్లలమర్రి సందర్శన కార్యక్రమానికి 22మంది అతిథుల కో సం ఏకంగా 1,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేయడం గమనార్హం.
మరో 500 మంది వరకు అధికార యంత్రాంగం ఇక్కడే తిష్ట వేసింది. కళాకారులు, సహాయ సిబ్బంది మరో 200మంది వరకు ఉండనున్నారు. అతిథులకు పాలమూరు వంటకాలను రుచి చూపించనున్నారు. కాగా, పిల్లలమర్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమతి లేనిదే ఎవరినీ పిల్లలమర్రికి రానివ్వడం లేదు. కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి నేతృత్వంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గురువారం కలెక్టర్, ఎస్పీతోపాటు అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతా ప్, మోహన్రావు, అదనపు ఎస్పీ రాములు, డీఎఫ్వో సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, ఆర్డీవో నవీన్, డీఈవో ప్రవీణ్ ఏర్పాట్లను పరిశీలించారు.
22మంది అతిథుల బృందానికి స్వాగతం పలికాక పిల్లలమర్రి మ్యూజియానికి తీసుకెళ్తారు. అక్కడ ఉమ్మడి జిల్లాలో లభించిన వివిధ కళాకృతులను శిలాశాసనాలను చూపిస్తారు. అనంతరం అక్కడే ఉన్న ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత సుమారు మూడున్నర ఎకరాల్లో విస్తరించిన పిల్లలమర్రి మహావృక్షాన్ని చూపిస్తారు. ఈ వృక్షం పుట్టుపూర్వోత్తరాలను వివరిస్తారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య తిరిగి హైదరాబాద్కు ప్రత్యేక ఎస్కార్ట్ ద్వారా అతిథులు బయలుదేరి వెళ్లనున్నారు.