నాగర్‌కర్నూల్, జూలై 27 : నాగర్‌కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 111 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌తో శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం స్నాక్స్ రూపంలో క్యాబేజీతో పకోడీలు ఇచ్చారు. తర్వాత రాత్రి క్యాబేజీ కూరతోపాటు పకోడీ, పెరుగుతో భోజనం చేసిన విద్యార్థినులు ఒక్కొక్కరుగా కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం సిబ్బందికి చెప్పినా ట్యా బ్లెట్లు వేసి కొద్దిమందిని దవాఖానకు తరలించి నిర్లక్ష్యం చేశారు. ఆదివారం కావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకోవడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలిసింది.
దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులకు తెలియడంతో వారే వచ్చి స్వయంగా 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది స్పందించారు. అప్పటికే దాదాపు ఒక్కొక్కరుగా శనివారం రాత్రి వరకు 79 మంది వరకు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారందనీ నాగర్‌కర్నూల్ జనరల్ దవాఖానకు తరలించారు. వైద్యం అందించిన డాక్టర్లు అందులో 12 మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. మిగతావారికి రాత్రంగా చికిత్స అందించారు. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు విద్యార్థినులను పడుకోబెట్టి 67మందికి స్లైన్లు ఎక్కించి ఫుడ్ ఫాయిజన్ విష యం బకటకు పొక్కకుండా వైద్యం చేశారు. తల్లిదండ్రులు దవాఖానకు పరుగులు పెట్టారు.
చికిత్స అందిస్తుండగానే మరో 50మంది విద్యార్థినులు రెండు 108 అంబులెన్స్ ల్లో కడుపునొప్పి, వాంతులతో దవాఖానకు చేరుకున్నా రు. దీంతో దవాఖానలో బెడ్లు లేక ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టి వైద్యం చేశారు. విద్యార్థినులను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, మధ్యాహ్నం ఒంటి గంటలోపే అస్వస్థతకు గురైన విద్యార్థినులకు నయం కాకపోయినా డిశ్చార్జ్ చేసి పాఠశాలకు పంపించారు. కేవలం ఐదుగురు విద్యార్థినులను మాత్రమే దవాఖానలో ఉంచారు.
మాజీ మంత్రులు హరీష్‌రావు, లక్ష్మారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు విద్యార్థినులను పరామర్శించడానికి వస్తున్నారని తెలుసుకున్న అధికార యంత్రాంగం హైడ్రామా సృష్టించారు. ఓ గేటు నుంచి నాగం జనార్దన్‌రెడ్డి దవాఖాన లోపలికి వెళ్తుండగా, మరో దారి నుంచి విద్యార్థినులను 102 అమ్మ ఒడి వాహనంలో బలవంతంగా పాఠశాలకు తరలించారు. చాలా మంది విద్యార్థినులకు నయం కాకముందే ఒకే వాహనంలో దాదాపు 15 నుంచి 20 మందిని పాఠశాలకు తరలించారు. ఈ విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపారు.
దగ్గరుండి మరీ విద్యార్థినులను 102 అంబులెన్స్‌లో పంపించడంపై తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను కూడా చూసుకోనివ్వకుండా, దవాఖానకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. నాగం పరామర్శకకు వెళ్లిన సమయంలో కేవలం ఐదుగురు విద్యార్థినులు మాత్రమే చికిత్స పొందుతున్నట్లుగా, అందరికీ నయమైనట్లు చిత్రీకరించారు. మీడియాను సైతం విద్యార్థినులను కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక పోలీసులు కాకుండా డివిజన్లోని పలు స్టేషన్ల నుంచి పోలీసులను రప్పించి దవాఖానకు వెళ్లే అన్నిదారుల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వివిధ పత్రికలు, ఛానళ్లకు సంబంధించి జర్నలిస్టులు రావడంతో వారిని లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో పోలీసులు, జర్నలస్టులకు కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది.
కొల్లాపూర్, జూలై 27: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ వసతి గృహాలు సమస్యలకు నిలయంగా మారాయని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. కొల్లాపూర్ ఘటన మరువక ముందే నాగర్‌కర్నూల్‌లో ఫుడ్ పాయిజన్‌తో 50మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై అధికారులు, సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్తీ ఆహారాన్ని పెట్టి ఇంకెంత మందిని దవాఖాలన పాలు చేస్తారని, పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా అంటూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సంక్షేమ వసతి గృహాలపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని, వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.