మహబూబ్నగర్ నెట్వర్క్, ఆగస్టు 20 : ఉ పరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వాగులు, వంకలు పారాయి. చెరువులు నిండి అలుగులు పోశాయి. అయిజ-కర్నూల్, అయిజ-ఎమ్మిగనూర్ అంతర్రాష్ట్ర రహదారులతోపాటు ఉత్తనూర్ – సింధనూర్, అయిజ – తూంకుంట, అయిజ – చిన్నతాండ్రపాడు గ్రామీణ రోడ్లపై వాగులు ఉధృతంగా పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
అయిజ – పులికల్ రోడ్డులోని పోలోని వా గుపై డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. కర్నూల్ రహదారిలో ఉన్న వంతెనపై నాలుగు అడుగుల మేర ప్రవాహం పారడంతో పోలీసులు రాకపోకలను నిలిపివేయించారు. దీంతో 6 గంటలపాటు ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. అయిజలోని లో తట్టు కాలనీలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీటి మునిగాయి. కంది, పత్తి, వరి దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందారు. అయిజలో రాష్ట్రంలోనే అత్యధికంగా 133.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
14 ఏండ్లల్లో ఎప్పడూ ఇంత వర్షం కురవలేదని అయిజ మండల రైతులు పేర్కొన్నారు. అ యిజ పీహెచ్సీ ఆవరణ నీటితో చెరువును తలపించింది. దవాఖానకు వచ్చేందుకు రోగులు, సిబ్బంది తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మల్దకల్ మండలం చర్లగార్లపాడు ప్రాథమిక పాఠశాల ఆవరణలో నీరు నిలవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అలాగే వెళ్లారు. అలాగే జడ్చర్ల మండలంలో భారీవర్షం కురిసింది. స్థానిక డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పాతబజార్, పెద్దగుట్ట, పద్మావతీ కాలనీ, తాలూకా క్లబ్ ప్రాంతంలోని నీళ్లన్నీ నల్లకుంట వద్ద కాల్వలోకి రావడంతో పొంగింది. దీంతో జడ్చర్ల-నాగర్కర్నూల్ ప్రధాన రహదారిపైకి చేరడంతో నడుములోతు వరకు ప్రవాహం కొనసాగింది. అలాగే స్థానిక ప్రభుత్వ వంద పడకల దవాఖాన ఆవరణను వర్షపునీరు ముంచెత్తింది. రోగులు ఇబ్బందులు పడ్డారు. అయిజ మండలంలో భారీ వర్షం కురవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో విద్యాసంస్థలకు కలెక్టర్ బీఎల్ సంతోష్ సెలవు ప్రకటించారు.