మహబూబ్‌నగర్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కు రుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొం గిపొర్లుతున్నాయి.. జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా జిల్లా కేం ద్రాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది.. ఉమ్మడి జిల్లాలోని పెద్దవాగులన్నీ ఉప్పొంగుతున్నాయి.. దుందుభీ నదితోపాటు సంగంబం డ, ఊకచెట్టు, కందూరు వాగులు పొంగిపొర్లుతున్నాయి.. అటు ఎగువన కురుస్తున్న వర్షాలతోపాటు ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, భీమా నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.
భీమా నదికి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చి కృష్ణానదిలో కలుస్తోంది. జూరాల ప్రాజెక్టు 45 గేట్లు ఎత్తి మూడు లక్షల 50 వేల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. మరోవైపు సంగంబండ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వరద వస్తుండడంతో నాలుగు గేట్లు ఎత్తి సుమారు 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల భారీ వర్షాలకు కాల్వలు తెగిపోయి పంటలకు నష్టం వాటిల్లింది. ఊట్కూరు మండలంలో చెరువులు నిండడంతో వరి పంట నీటిలో కొట్టుకుపోయింది. ఇదే మండలంలో సోమేశ్వరబం డ నుంచి మక్తల్‌కు వస్తుండగా మల్లేపల్లి వద్ద కారు వాగులో చిక్కుకున్నది.
డోకూర్ నుంచి దేవరకద్రకు వచ్చే దారిలో రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీవర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతోపాటు మత్తడి దుంకుతున్న చెరువులతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం బావాయిపల్లి వాగు నిండుగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లాపూర్ సమీపంలో పెద్దవాగు పొంగడంతో ముక్కిడిగుండం-కొల్లాపూర్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
కౌకుంట్ల-ఇస్రంపల్లి గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా గ్రా మాల మధ్య రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. జడ్చర్లలో కురిసిన భారీ వర్షానికి రహదారులు మొత్తం జలమయమయ్యాయి. పట్టణం సమీపంలోని వంద పడకల దవాఖాన జలదిగ్బంధంలో చిక్కుకున్నది. మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సూచిస్తున్నారు.
రానున్న 72 గంటల్లో ఉ మ్మడి జిల్లాలో అనేక ప్రాంతా ల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టరేట్లో కంట్రో ల్ రూంలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కురుస్తు న్న భారీ వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనట్లు ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయా జిల్లా కలెక్టర్లు తెలిపారు.
ఏ సమయంలోనైనా ప్రజలు ఫోన్ ద్వారా కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వవచ్చని సూచిస్తున్నారు. వర్ష ప్రభావిత ప్రాం తాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా ఆయా శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్లు సూచించారు. ఉమ్మడి జిల్లాకు రెడ్అలర్ట్ ప్ర కటించడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలు ఆదేశించారు. ఈ కంట్రోల్ రూంలు 24/7 పని చేస్తాయని అధికారులు ప్రకటించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 100కు కూడా ఫోన్ చేయొచ్చని ఎస్పీలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కృష్ణానది ప్రమాదకరంగా ప్ర వహిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించా రు. వాగులు, వంకలతోపాటు కాజ్‌వేల వద్ద పహారా కాశారు. రెవె న్యూ అధికారుల సమన్వయంతో రహదారులపై వాగులు పొంగుతున్న చోట్ల ప్రజలను దాటనివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు మున్సిపల్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
వైద్య సిబ్బంది నిత్యం సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
మహబూబ్‌నగర్ : 08542-241165
నారాయణపేట : 9154283914
జోగుళాంబ గద్వాల : 9100901605
వనపర్తి : 08545-233525, 08545-220351
నాగర్‌కర్నూల్ : 08540-230201