అయిజ, జూలై 2 : తుంగభద్ర తెలంగాణ రాష్ట్రంలోకి వడివడిగా పరవళు ్లతొక్కుతున్నది. ఎగువ న కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో బుధవారం కర్ణాటకలోని హోస్పేట్లోని తుంగభద్ర డ్యాం 6 క్రస్ట్ గేట్లు ఒక అడుగు మేరకు ఎత్తి దిగువకు 15,136 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో తుంగభద్ర పరవళ్లు తొక్కుతూ ఆర్డీఎస్, సుంకేసుల, శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నది. టీబీ డ్యాం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకల ద్వారా తుంగభద్ర జలాశయానికి వరద వచ్చి చేరుతోంది.
ఇన్‌ఫ్లో 36,063 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 17,635 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల సా మర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 78.007 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1625.46 అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. టీబీ డ్యాంకు రాత్రి ఇన్‌ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తుంగభద్ర నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ బోర్డు ప్రమా ద హెచ్చరిక జారీ చేసింది. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు శుక్రవారం వరద నీరు చేరుకుంటుందని, అక్కడి నుంచి సుంకేసుల మీదుగా, శ్రీశైలం ప్రాజెక్టుకు తుంగభద్ర జలాలు చేరుకుంటాయని ఆర్డీఎస్ ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
గద్వాల, జూలై 2 : జూరాలకు వరద కొనసాగుతున్నది. బుధవారం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 67,000 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 5 గేట్లు ఎత్తి దిగువకు 32,650 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి 31,380 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 650, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల ప్రధాన ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 280, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, భీమా లిఫ్ట్-2కు 750, సమాంతర కాల్వకు 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు అవుట్ ఫ్లో 66,317 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.060 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
శ్రీశైలం, జూలై 2 : శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. బుధవారం ఎగువ నుంచి సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో 70,883 క్యూసెక్కులు నమోదుకాగా అవుట్ ఫ్లో 63,023 క్యూసెక్కులు నమోదైంది. అదే విధంగా జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.60 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.3148 టీఎంసీలు ఉన్నాయి. అదేవిధంగా శ్రీశైలం కుడి, ఎడ మ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.