అలంపూర్ చౌరస్తా, జూలై 3 : నిత్యం ప్రమాదం.. అయినా జీవనోపాధి కోసం పోరాటం.. చెరువులో వల వేస్తేనే వారి కుటుంబ్లాలో ఐదు వేళ్లు నోట్లో వెళ్లుతాయి.. ఆ రోజు వల వేయలేదా అర్ధాకలితో అలమటించాల్సిందే.. అంత దుర్భర జీవితాలతో అలమటిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు కేసీఆర్ నేనున్నానంటూ అండగా నిలిచాడు.. కులవృత్తుల వారికి చేయూతనందించారు. అందులో భాగంగానే మత్స్యకారుల జీవనోపాధికి ప్రతి ఏడాది ఉచితంగా చేపపిల్లలను పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. తద్వారా మత్స్యకారులు వాటిని పెంచి విక్రయించి మంచి లాభాలు గడించారు.
కానీ రా ష్ట్రంలో కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి రావడంతో చేపపిల్లలు పంపిణీ పథకం కాస్త నీరుగారిపోయింది. ఈ ఏడాది మే, జూన్ నెలలు పూరైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం టెండర్ల ప్రక్రియ ఊసే ఎత్తడం లేదు. దీంతో ఈ ఏడాది కూడా చెరువులో చేప పిల్లలను ప్రభుత్వం వదులుతుందా లేదా? అనే అనుమానాలు మత్స్యకారుల కుటుంబాల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం చెరువుల్లో చేప పిల్లలను వదలకుంటే ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే 1500 మత్స్యకారుల కుంటుబాలు రోడ్డున పడనున్నాయి.
నాడు కళకళ.. నేడు వెలవెల..
మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికాభివృద్ధి చెందాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2016-17 సం వత్సరంలో ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. అప్పటి ను ంచి క్రమం తప్పకుండా ప్రతి ఏ టా మత్స్యకారుల సొసైటీల కు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేసింది.
కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతేడాది అంతంత మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నది. దీంతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళకళలాడిన మత్స్యకారుల కుటుంబాలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో విలవిలలాడే దుస్థితి చేరుకున్నది.
ఊసేలేని టెండర్ల ప్రక్రియ..
ఈ ఏడాది ముందుగానే వర్షాలు ప్రారంభం కావడంతో జలశయాల్లో నీరు చేరుతున్నా ఉచిత చేప పిల్లలు వదిలే అవకాశం ఉంటుందో లేదో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి ఏడాది మే నెలలో చేప పిల్లలను కొనేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిచేది. వర్షాలు కురిసి చెరువుల్లో నీరు చేరగానే మత్స్యకారులకు ఆ శాఖ అధికారులు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేసేవారు. కానీ ఏడాది మే, జూన్ నెలలు పూర్తయిన ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. దీంతో ఈ ఏడాది కూడా చేప పిల్లల పంపిణీ లేనట్టేనని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనోపాధిని దెబ్బతీయొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లా మత్స్య శాఖాధికారిణి భానును వివరణ కోరేందుకు ఫోన్ చేయగా.. అందుబాటులోకి రాలేదు.
జిల్లాలో ఇలా..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 345 చెరువులు, కుంటలు, ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి కింద జిల్లాలో 92కు పైగా మత్స్యకార సహకార సంఘాలున్నాయి. అందులో 5 వేల మందికిపైగా చేపలు పట్టి విక్రయించి ఉపాధిని పొందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాలో మత్స్యకారుల సహకార సంఘాలకు 1.69 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసి వారి ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ తోడ్పా టునందించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ప్రభుత్వం రావడం చేపపిల్లల పంపిణీ పథకం కాస్త నీరుగారిపోయింది.
మత్స్య కుటుంబాలను ఆదుకోవాలి
జిల్లాలో 345 చెరువులు, కుంటలు, 7 ప్రాజెక్టులు ఉన్నాయి. 92 సహకార సంఘాల పరిధిలో 1500 మత్స్యకారుల కుటుంబాలు చేప పిల్లల పెంచి విక్రయించి జీవనోపాధి పొందుతున్నారు. గత ప్రభుత్వంలో వందశాతం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి మత్స్యకారుల ఆర్థికాభివృద్థికి కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది సగం వరకు మాత్రమే పంపిణీ చేసింది.
టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు నాసిరకం చేప పిల్లలను పంపిణీ చేయడంతో మత్స్యకారులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నేరుగా మత్స్యకారుల సొసైటీకి డబ్బులు జమ చేస్తే మత్స్యకారులు నాణ్యమైన చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువులో వదులుతారు. ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించి చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకోవాలి.
– గోపాల్, మత్స్యశాఖ సహకార సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు