వనపర్తి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో ఓ కుంటలో చేపలు పట్టుకొని వస్తుండగా మత్స్యకారులపై అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం పెట్రోల్ పోసి నిప్పుపెడతామంటూ గొడవకు దిగిన ఘటన చోటుచేసుకున్నది. మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన లక్ష్మమ్మకుంటలో గత ఐదారేండ్లుగా గ్రామ మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో చేపలు వదలడం.. వాటిని మళ్లీ పట్టుకుని విక్రయించడం జరుగుతూ వస్తున్నది. రామకృష్ణాపురం మత్స్యకార సంఘంలో 30 మంది సభ్యులున్నారు. వీరంతా ముతిరాసి కుటుంబాలకు చెందిన వారే. అయితే,రెండు బొలేరో వాహనాల్లో వలలు, బుట్టలు వేసుకుని మత్స్యకారులంతా లక్ష్మమ్మకుంటలో ఉదయం చేపల వేటకు వెళ్లారు.
వేట అనంతరం మధ్యాహ్నం మత్స్యకారులు చేపలతోపాటు వాహనాలతో బయలు దేరిన సమయంలో అదే గ్రామానికి చెందిన భార్యాభర్తలు, వారి కొడుకు ముగ్గురు పెట్రోల్ బాటిల్తో వచ్చి మత్స్యకారులపై పోసి తగులబెడతానంటూ గొడవకు దిగారు. మత్స్యకారులు బయపడి అక్కడి నుంచి పరుగులు తీయగా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే ఈ ఘటనపై కొత్తకోట పోలీసులకు మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. గతంలో ఈ కుంటలో ఆయకట్టు రైతులే చేపలు పట్టుకునే వారని, క్రమంగా ఐదేండ్ల్ల నుంచి మత్స్యకారులు సంఘంగా ఏర్పడి ప్రభుత్వ విధానాల ప్రకారం జిల్లా మత్స్యశాఖ పరిధిలో చేపలు విడుదల చేయడం.. పట్టుకోవడం జరుగుతు వస్తుందని, ఒక్క కుటుంబం మాత్రమే మత్స్యకారుల చర్యను ఆటంకపరుస్తున్నదని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.
కుంటలో దాదాపు 10 ఎకరాల భూమి ముంపునకు గురి అవుతుండగా, ఇందులో 7 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, మిగితా మూడు ఎకరాలు బ్రాహ్మణుల పేరుతో ఉండేదని మత్స్యకారులు చెబుతున్నారు. బ్రాహ్మణుల పేరుతో ఉన్న భూమి ఆధారంగా ఓ కుటుంబం తమపై దాడికి పూనుకుంటుందని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. ముందుగానే మత్స్యకారులు ఈ నెల 23న ఎస్పీకి తమకు చేపలు పట్టే సమయంలో భద్రత కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు. అలాగే చేపలు పట్టేందుకు వెళ్లినప్పుడు కూడా కొత్తకోట పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. అయితే చేపలు పట్టడానికి ఆటంక పరుస్తున్న వారికి అధికార పార్టీ అండ ఉన్నట్లుగా చెబుతుండగా, తమ అన్యాయం చేస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.