దేవరకద్ర, జూన్ 1 : గీతా కార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం గ్రామాల్లోని చెరువు కట్టల పై, వాగు సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా ఈత చెట్లను నాటించింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. దేవరకద్ర మండలంలోని వెంకటాయపల్లి సమీపంలోని 74 సర్వేనెంబర్లో కేసీఆర్ ప్రభుత్వంలో 200కు పైగా ఈత మొక్కలను నాట గా, ప్రస్తుతం 150 చెట్లు ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇసుక మాఫియా శుక్రవారం అర్ధరాత్రి ఇసుక కోసం ఈతచెట్లకు నిప్పుపెట్టి కాల్చివేసింది. ఈత చెట్లను కాల్చడంతో గీతా కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం గురించి అధికారులకు చెప్పి నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈతచెట్లను కాల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.